ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (17:49 IST)

అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. రెడ్‌కార్పెట్ పరిస్తే యాక్షన్ !(Video)

chandrababu
అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ వచ్చారు. తన పర్యటనల సందర్భంగా దారికి ఇరువైపులా పరదాలు కట్టినా, చెట్లు నరికివేసినా, సభా వేదిక ముందు భాగంలో రెడ్ కార్పెట్లు పరిచినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు అలవాటుపడిన అధికారుల్లో ఇంకా మార్పు రాలేదని, మున్ముందు ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 
 
గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
 
అలాగే, 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశను పూర్తి చేస్తామన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దీనిని పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు. హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్నారు. ఈ ప్రాంతానికి భోగాపురం గ్రోత్ ఇంజన్‌గా పని చేస్తుందన్నారు. విమానాశ్రయం పూర్తయితే ఈ ప్రాంతం ఎకనమిక్ హబ్ గా మారుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
 
భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు.
 
అప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఉత్తరాంధ్ర అద్భుత విజయాన్ని అందించిందని... ఇలాంటి ప్రాంతానికి ఏదైనా చేయాలన్నారు. అందువల్లే జిల్లా పర్యటనలలో భాగంగా తొలుత ఉత్తరాంధ్రకే వచ్చానన్నారు. విశాఖపట్నం - విజయనగరం కలిసిపోతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయన్నారు. విశాఖపట్నానికి మెట్రో రావాల్సి ఉందన్నారు. మున్ముందు కుప్పం సహా ఐదు విమానాశ్రయాలు వస్తాయన్నారు.