సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 12 ఏప్రియల్ 2017 (23:09 IST)

సీఎం చంద్రబాబును తెలంగాణ-ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకున్నాయ్... మంత్రి సోమిరెడ్డి

మిర్చి రైతుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని... వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. భారీగా మిర్చి పంట దిగుబడి రావడంతో, ధరలు తగ్గాయని మంత్రి తెలిపారు. గత ఏడాది అధిక దిగుబడులు, ధరలు రావడంతో రైతులు ఈ ఏడాది పెద్ద మొత

మిర్చి రైతుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని... వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. భారీగా మిర్చి పంట దిగుబడి రావడంతో, ధరలు తగ్గాయని మంత్రి తెలిపారు. గత ఏడాది అధిక దిగుబడులు, ధరలు రావడంతో రైతులు ఈ ఏడాది పెద్ద మొత్తంలో 17 శాతం అధికంగా మిరప పంట వేశారని చెప్పారు. భారీగా మిరప పంట వేయడంతో 19 శాతం అధికంగా ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. గత ఏడాది రూ.  10 వేలు, రూ.11 వేల వరకు ధర పలికిన మిర్చికి ఈ ఏడాది రూ. 7 వేలు, రూ. 6 వేలు, ప్రస్తుతానికి రూ. 4500కు పడిపోయిందని మంత్రి చెప్పారు. క్వింటా మిరప కోతకు రూ. 2500 ఖర్చు అవుతుందని... దీంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయని... తెలిపారు.  
 
మిర్చి రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి ఈ విషయంలో మంత్రితో ఈ విషయంపై మాట్లాడారని... రాష్ట్రానికి తక్షణం న్యాయం జరిగేలా ఢిల్లీలో కార్యాచరణ జరుగుతున్నట్టు సోమిరెడ్డి వివరించారు. 8 మంది ఎంపీలతో కలిసి, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు గురువారం సమావేశమై...  మిర్చి రైతులకు న్యాయం జరిగేలా కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. 
 
ప్రస్తుతం నిల్వలు ఎక్కువగా  ఉండిపోవడంతో సమస్యలు ఎదురయ్యాయని... కోల్డ్ స్టోరేజ్ లన్నీ కూడా నిండిపోయాయని... ఎలా నిల్వ చేయాలన్నదానిపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని చెప్పారు.  కేంద్ర గిడ్డంగుల్లోనూ నిల్వలు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటి వరకు మిర్చికి కనీస మద్దతు ధర  లేదని, అదే విధంగా పసుపు, ఉల్లికి మద్దతు ధర  లేకపోవడంతో వీటికి కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన పేర్కొన్నారు.  
 
ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని చర్యలను చేపడుతున్నట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధ చేశామని... మార్కె ఫెడ్ ద్వారా మరో 2 లక్షల  మెట్రిక్ టన్నుల పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు టెండర్ల ప్రక్రియను ఫైనలైజ్ చేస్తున్నామన్నారు. రైతులకు ఉపకరించే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ టెండర్స్‌ను పిలుస్తామన్నారు. 
 
రైతుల విషయంలో అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని... ఏపీని ఆగ్రిరేరియన్ హబ్‌గా చేస్తున్నామని... రాష్ట్రానికి ఉన్న అన్నపూర్ణ పేరును  కాపాడతామని సోమిరెడ్డి వివరించారు. యంత్రాలు రైతులకు ఉపయోగపడే విధంగా ఫార్మ్ మెకనైజేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఖరీఫ్ కు సంబంధించి ఎరువులు, విత్తనాలు, ఫార్మ్ మెకనైజేషన్, క్రాప్ ఇన్సూరెన్స్... ఇలా అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉన్నామని మంత్రి చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకోగా... తాజాగా మహారాష్ట్ర సైతం అదే విధంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ చేశామన్నారు. 22 కోట్ల జనాభా ఉన్న యూపీలో రూ. 30 వేల కోట్లు చేస్తే... 5 కోట్ల జనాభా ఉన్న ఏపీ రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ... రూ. 24 వేల కోట్లతో రుణమాఫీ చేశామని ఆయన చెప్పారు. హార్టీ కల్చర్ రైతులకు కూడా రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్రానిదని మంత్రి తెలిపారు. అర్హులై... రుణమాఫీ అందని వారికి రుణమాఫీ అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇటీవల కాలంలో నెల్లూరులో అర్హులైన 200 మందికి రుణమాఫీ లభించేలా చేశామన్నారు. రైతుల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి చెప్పారు.
 
వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్  రూపకల్పన చేశామని... ఒకేసారి మిర్చి విపరీతంగా రావడం వల్లే సమస్య ఎదురైందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని... కేంద్ర గిడ్డంగులను వాడుకునే విషయాన్ని  కూడా పరిశీలిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ఏ మేరకు రాష్ట్రానికి తీసుకురావచ్చన్నదానిపై  తీవ్రంగా పనిచేస్తున్నామన్నారు. కచ్చితమైన ప్రణాళికతో వస్తే కేంద్రం నుంచి నిధులు ఇప్పించేందుకు తాన సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య తనకు చెప్పారని ఆయన తెలిపారు. అవసరమైతే ఢిల్లీ నుంచి నిధులు రాబట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.