శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:10 IST)

థర్డ్ వేవ్‌పై సమీక్ష.. కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి థర్డ్ వేవ్‌పై సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలని తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా మరో గంట పాటు కర్ఫ్యూ సడలింపును ప్రకటించారు.
 
ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అనుమతులు ఇవ్వనుండగా.. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఇక పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందన్న సీఎం.. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తప్పనిసరి అని అన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.45 శాతం ఉందని వైద్యశాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని.. మిగతా మూడు జిల్లాల్లో 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. థర్డ్ వేవ్‌కు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.