మరో వాలంటీర్ ఆత్మహత్య : రూ.5 వేలతో కుటుంబాన్ని పోషించలేననీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వలంటీరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకుటున్నట్టు సూసైడ్ లేఖ రాసిపెట్టి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కోడుమూరు వార్డులో వాలంటీరుగా హబీబ్ బాషా (26) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన స్థానిక సుందరయ్య కాలనీలో నివాసం ఉన్నాడు. అల్లుగుండు అబ్దుల్ ఖాదర్, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు హబీబ్ బాషా. ఇద్దరు కొడుకులకూ పెళ్లి చేయాలని అబ్డుల్ ఖాదర్ నెల క్రితం నిర్ణయించారు.
అయితే, ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల వేతనంతో పెళ్లైన తర్వాత కుటుంబాన్ని పోషించం కష్టమని హబీబ్ బాధపడేవాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పేవాడు. చివరకు ఒత్తిడికి తట్టుకోలేక మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాయంత్రం 3 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయారు. అండగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.