తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... మోహన్ బాబు అలా చెప్పగానే...
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేసినట్లు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. ఐతే సుబ్బారెడ్డి తనకు రాజ్యసభ కావాలని అడిగారనీ, ఆ వ్యవహారం తర్వాత ఆలోచన చేద్దామని జగన్ అన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే వైవీ సుబ్బారెడ్డి స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న అవుతారు. జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త వైవీ సుబ్బారెడ్డి. ఎంబీఎ చదివిన సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పదవికి రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు సీటు లభించలేదు. ఈ నేపధ్యంలో ఆయనకు తితిదే ఛైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్.
కాగా సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి వరించనుందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మోహన్ బాబు ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు.
`నేను టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కొందరు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. నా ఆశయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడమే. అందుకోసమే నా వంతుగా కష్టపడ్డాను. వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకంతోనే నేను తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించాను. అంతేగాని ఎలాంటి పదవులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్లను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నాన`ని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆయనిలా చెప్పిన కొద్ది గంటల్లోనే జగన్ ముగింపు పలికారు.