మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (19:51 IST)

వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు ప్రభుత్వం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారి దిశా నిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా వారి గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

క్రొత్తగా ఏర్పాటుచేసే 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు సుమారు 35 రకాల సేవలతో, అక్టోబర్ 2 నుండి అమలులోకి తీసుకొని రావటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలలో 1 లక్షా 26 వేల 728 పోస్ట్ ల భర్తీకి గాను సుమారు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

సెప్టెంబర్ 1 నుండి 8 వరకు  రాష్ట్రంలోని 5,314 పరీక్షా కేంద్రాల్లో గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం వ్రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక  ప్రక్రియ వ్రాత పరీక్షా ఫలితాల మెరిట్ ఆధారీతంగానే వుంటుంది.

ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు తావివ్వకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో పకడ్భంధీ ఏర్పాట్లను పూర్తిచేశారు. పరీక్షల నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ, విద్యాశాఖ, యూనివర్సిటీల సాంకేతిక సహకారం తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నాపత్రాలను తరలించేందుకు 1,174 రూట్లను గుర్తించడం జరిగిందని, 1 లక్ష 22వేల 554 మంది సిబ్బందిని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో నియమించామన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిల్లో మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సిబ్బందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు.

ఈ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా జరపడానికి వివిధ చర్యలు తీసుకోనడమైనది. అభ్యర్ధులను యాధృచ్చిక పద్ధతిలో వేరువేరు పరీక్షా కేంద్రాలకు కేటాయించడం జరుగుతుంది. పర్యవేక్షకులను కూడా అలానే యాధృచ్చిక పద్ధతిలో వేరువేరు పరీక్షా కేంద్రాలకు కేటాయించడం జరుగుతుంది.

ఓ.ఎం.ఆర్ జవాబు పత్రం యెక్క నకలును అభ్యర్ధులు తీసుకొనడానికి అనుమతి కలదు. అభ్యర్ధులు వారికి వచ్చిన మార్కులు తెలుసుకోవడానికి వీలుగా, పారదర్శకతను పాటించే నిమిత్తం, సరియైన జవాబుల ప్రతి (కీ) ని పరీక్ష జరిగిన అనంతరం, అదే రోజునే ప్రచురించబడుతుంది.

సీసీ టీవి/వీడియో కెమేరాలను అవసరమైన చోట్ల వినియోగించడానికి జిల్లా కలక్టర్లకు అనుమతిని ఇవ్వడమైనది. స్ట్రాంగ్ రూములకు, పరీక్షా కేంద్రాలకు మరియు సున్నితమైన పరీక్షా సామాగ్రి తరలింపుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది.

ఏ పరిస్థితిలోను ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదు. ఎటువంటి పుకార్లలను, వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు తెలియజేయడమైనది. వదంతులను వ్యాప్తిచేసే వారిపై తీవ్రమైన చర్యలను తీసుకోవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. ఈ పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగాను పటిష్టంగాను జరుగుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.