పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారీ వరద ప్రవాహం, నవయుగ కాంట్రాక్టర్ రద్దుతో పోలవరం పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ మొదటి వారం నుంచి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే నూతన కాంట్రాక్టర్ ను పిలవాలని నిర్ణయించింది.
రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కార్.. ఈనెల 17న పోలవరంకు రివర్స్ టెండర్ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పోలవరం హెడ్‌వర్క్స్ తోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతితో ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది.
ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనుల కాంట్రాక్టు ఇవ్వనుంది. ఇటీవల పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది.
ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. అందులో భాగంగా ప్రస్తుతమున్న కాంట్రాక్టర్ నవయుగను రద్దు చేసింది.