సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (18:27 IST)

మహిళా ఎమ్మెల్యేలను కించపరచిన ప్రబుద్ధుడు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భముగా జులై 24తేదీన 6గురు మహిళా ఎమ్మెల్యేల ఫోటోతో ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన ప్రబుద్ధుడిని పోలీసులు అత్యంత చాకచక్యముగా అరెస్టు చేసారు. 6గురు మహిళా శాసన సభ్యుల ఫోటోపెట్టి “ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు కదరా” అంటూ పెట్టిన పోస్టింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ బూతు పదాలు వాడి పోస్టింగ్ పెట్టడంతో మహిళా ఎమ్మెల్యేల ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నదంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లేజిస్లేచర్ సెక్రటరి బాలకృష్ణా చార్యులు రూరల్ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేసారు. పోస్టింగ్ పెట్టిన అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గుంటూరు రూరల్ ఎస్పీ వెంటనే కేసు నమోదు చెయ్యాలని తుళ్ళూరు డీఎస్పీ కి ఆదేశించారు. తుళ్ళూరు పోలీసులు ఐటీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచే పోస్టింగులు పెట్టిన ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చెయ్యాలని ఆదేశించారు.

దీనితో రూరల్ ఎస్పీ రంగంలోకి దిగినారు. పోలీసు శాఖ సరికొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందుతుడు ప్రకాశం జిల్లా చంద్రశేఖర పురం గ్రామానికి చెందిన పునుగుపాటి రమేష్ గా గుర్తించారు. 
 
 
ప్రత్యేక బృందాల ఏర్పాటు
డీజీపీ గౌతం సవాంగ్ స్వీయ పర్యవేక్షణలో రూరల్ ఎస్పీ ఆధ్వర్యములో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుని ఐపీ అడ్రస్సు, ఐఎంఈఐ నెంబర్ మరియు ఇతర సాంకేతిక పరమైన ఆధారాలతో విచారించగా ప్రకాశం జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలియడంతో అక్కడకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించారు.

అప్పటికే నిందితుడు అక్కడినుండి నెల్లూరు జిల్లాకు మకాం మార్చాడు. నిందితుడు సెల్ ఫోన్ సిమ్ లు మారుస్తూ పోలీసులకు చిక్కకుకండా తెలివిగా వ్యవహరించాడు. పోలీసులు రెండవ బృందాన్ని నెల్లూరుకు పంపించి అక్కడ నిందితుని జాడ తెలుసుకోగా  రమేష్ త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హుటాహుటిన ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకోగా నిందితుడు సేలం మీదుగా చెన్నై కి అక్కడి నుండి బెంగుళూరుకి చెక్కేసాడు. ఆయా ప్రాంతాలలో లాడ్జీలలో మంచాలు అద్దెకిచ్చే చోట ఆశ్రయం తీసుకుంటూ వేకువజామునే తన మకాం మార్చి వేరొక చోటికి వెళ్ళేవాడు.

ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి ప్రకాశం, నెల్లూరు, తమిళనాడులోని చెన్నై, సేలం కోయంబత్తూర్, మరియు కర్నాటక రాష్ట్రం లోని బెంగుళూరు  ప్రాంతాలలో ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడి ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా బెంగుళూరు నుండి ప్రయాణిస్తుండగా మాటువేసి అరెస్టు చేసారు. 
 
 
పోలీసుల అమ్ముల పొదిలో సైబర్ సాంకేతికత
ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టింగులు, మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలను మరియు స్త్రీల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు పోస్టింగ్ పెడితే అది ఏ ఫోన్ నుండి పోస్టింగ్ పెట్టాడు, దాని ఐఎంఈఐ నెంబరు ఏమిటి లేదా ఏ కంప్యుటర్ నుండి ఏ ఇంటర్ నెట్ కేంద్రము నుండి పోస్టింగ్ పెట్టాడు ఏ ఐపీ అడ్రస్సు నుండి పోస్టింగ్ పెట్టాడు, ఫేక్ ఫేస్ బుక్ అకౌంటు నుండి పోస్టింగు పెట్టినా, ఏ ప్రాంతము నుండి పోస్ట్ చేసినా వాటన్నిటి వివరాలను పోలీసులు సులువుగా తెలుసుకునే సాంకేతికతలో పోలీసులు శిక్షణ పొందారు.

మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ పోస్ట్ పెట్టిన పునుగు పాటి రమేష్ ను తక్కువ సమయంలోనే 3 రాష్ట్రాలలో తలదాచుకున్నప్పటికి సుమారుగా 30కి పైగా సిమ్ లు మార్చినప్పటికీ దాదాపుగా 1500 కిలోమీటర్ట్లు దాటి వెళ్ళినప్పటికీ అతని కదలికలను గమనిస్తూ అత్యంత చాకచక్యముగా పట్టుకోవడం జరిగినది. 
మహిళల రక్షణకు సైబర్ మిత్ర. 

మహిళల భద్రతకు మరియు రక్షణకోసం గౌతంసవాంగ్ పోలీస్ శాఖలో సైబర్ మిత్ర విభాగాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఈ సైబర్ మిత్రకు టోల్ ఫ్రీ నెంబర్లు గా 112 మరియు 181 నెంబర్ల ద్వారా, వాట్సప్ నంబర్ 9121211100, ఫేస్ బుక్ చిరునామా “ap police women safety cyber space” ద్వారా కూడా మహిళలు ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ మిత్రకు మహిళల నుండి విశేష స్పందన లభిస్తుంది.

ప్రారంభించిన 15 రోజులలోనే 54 మంది ఫిర్యాదులు చేశారు. పోలీసులు సైబర్ సాంకేతికను ఉపయోగించి అత్యంత వేగంగా 41 కేసులను చేదించడం జరిగినది. గుంటూరు  జిల్లాలో 7 కేసులు  నమోదు కాగా  ఏడూ చేదించి  అరెస్టు చేయడం జరిగినది.