ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:53 IST)

విజయవాడ నగర ప్రజలు జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర : నారా లోకేశ్

nara lokesh
విజయవాడను ముంచెత్తిన వరదలకు ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే ప్రధాన కారణమంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని, నిజానికి విజయవాడ ప్రజలను జల సమాధి చేసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని ఏపీ విద్యామంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. విజయవాడ వరదలపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. వైకాపా కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. 
 
'సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. ఐదు ఊర్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేయాలని కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీన్ని ప్లాన్‌ చేసింది సైకో జగన్‌ అయితే.. అమలు చేసింది వైకాపా ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌' అని లోకేశ్‌ ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఉన్న నిజాలను పూర్తిగా బహిర్గతం చేస్తామని ఆయన తెలిపారు.