కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు... మంత్రి నారాయణ
అమరావతి : పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కాపులను బీసీలో చేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ఇచ్చిన హామీ
అమరావతి : పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కాపులను బీసీలో చేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాయితీతో పని చేస్తున్నారన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారి సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. అలాగే కాపులను బీసీల్లో చేర్చడానికి కమిషన్ ఏర్పాటు చేశారని, కమిషన్ నివేదిక రాగానే శాసనసభలో ఆమోదించి, దానిని పార్లమెంటుకు పంపుతామని, అక్కడ కూడా ఆమోదింపజేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలకూ తావులేదన్నారు.
నివేదిక త్వరగా అందజేయాలని జ్యుడిషియల్ కమిషన్ను మనం ఆదేశించే అధికారం లేదన్నారు. వారు తగినంత సమయం తీసుకుని నివేదిక ఇస్తారని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందని ఆశిస్తున్నామన్నారు. మరోసారి తుని లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ఇంటిలిజెన్స్ అందజేసిన సమాచారం ప్రకారం అరాచక శక్తులు అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా వున్నట్టు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది పనిగట్టుకొని కాపులను రెచ్చగొడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల కాపులు అప్రమత్తంగా వుండాలని మంత్రి నారాయణ కోరారు. తమ ప్రభుత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుందన్నారు.
కాపు పెద్దలతో చర్చించి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విరమించుకోవడమం మంచిదని ఆయన హితవు పలికారు. 35 ఏళ్లుగా ఎదురు చూసినవారు కొద్ది నెలలు ఆగలేరా అని ప్రశ్నించారు. కాపులంటే అరాచక శక్తులనే ముద్రవేయవద్దని కోరారు. కాపులను తమ ప్రభుత్వం బీసీల్లో చేర్చడం ఖాయమన్నారు. దీనివల్ల సీఎం చంద్రబాబునాయుడికి కాపుల్లో ఇమేజ్ పెరుగుతుందనే భయంతోనే ముద్రగడ పాదయాత్ర చేపడుతున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు.