ఒకటి రెండు అత్యాచారాలకే రాద్దాంతమా? మంత్రి ఆర్.కె.రోజా
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. కామాంధులు రెచ్చిపోతున్నారు. సాక్షాత్ ఏపీ ముఖ్యమంత్రి ఉండే గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, అధికార వైకాపా నేతలు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి, సినీ నటి ఆర్.కె.రోజా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితేనే ఇంత రాద్దాంతమా? అంటూ ప్రశ్నించారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం అనేక కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కానీ, విపక్షాలు మాత్రం ఎడిటింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ ఫోటో పెట్టుకుని చేస్తున్న బస్సు యాత్రలో కూడా జనం సందోహం కనిపిస్తుందన్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను చూస్తే బాధేస్తుందన్నారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇకపోతే, రాష్ట్ర సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే మహిళలపై దాడులు జరిగాయని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇంతకంటే ఎక్కువే జరిగాయన్నారు. ఒకటి రెండు అత్యాచార ఘటనలను బూతద్దంలో చూపించి రాద్దాతం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.