ఏపీలో సమస్యలపై తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య, నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, కేఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి, టీడీ జనార్థన్, బీద రవిచంద్ర యాదవ్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూడ్ విడుదలైంది. వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు బెదరకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుంది. ధరల పెరుగుదల మరియు పన్నుల పెరుగుదల భారం తగ్గుతుంది. ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు శ్రేణులు ఇప్పటి నుండే రంగంలోకి దిగాలని పార్టీ నిర్ణయించింది.
న్యాయస్థానం నుండి దేవస్థానానికి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్ట సంపూర్ణ మద్దతిస్తోంది. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పక్కన పెట్టి.. అచీవ్ మెంట్ అవార్డుల పేరుతో హడావుడి చేస్తూ కుసంస్కారాన్ని జగన్ రెడ్డి బయటపెట్టుకున్నారని పార్టీ విమర్శించింది. డ్రగ్స్, గంజాయి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎదురుదాడి చేసినా, అన్ని జిల్లాల ఎస్పీలు డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పిన అబద్దాలు బట్టబయలయ్యాయన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ ఢిల్లీలో ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదన్నారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండు చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగపోతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. గతంలో ధరలు అందుబాటులో ఉంటేనే ననా యాగీ చేసిన వైసీపీ.. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రజలు మోయలేకపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించకుంటే ప్రజలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.