రాష్ట్రంలో పోలీసులు గాడిదలు కాస్తున్నారు? సైకో జగన్ మంటల్లో కాలిపోవడం తథ్యం : బాబు ఫైర్
కృష్ణ జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సోమవారం దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే, కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్లకు కూడా నిప్పంటించారు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు గాడిదలు కాస్తున్నారా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఘాటైన పదజాలంతో ట్వీట్ చేశారు.
"గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ పేర్కొన్నారు.