బీమా కొరెగావ్ కేసులో వరవరరావుకు బెయిల్
విరసం నేత, రచయిత వరవరరావు (80)కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఏడాది తరువాత ముంబై హైకోర్టు వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది. వరవరరావు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఆరు నెలలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ముంబై విడిచి వెళ్లరాదని పేర్కొంది. బీమా కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్‌ఐఎ పేర్కొంటూ 2018 జూన్‌లో ఆయనను అరెస్టు చేసింది. అప్పటి నుండి వరవరావు ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత, కుటుంబసభ్యులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఆరోగ్యం క్షీణిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వాదించారు.
అయితే, వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. దీనిని 'ప్రత్యేక కేసు'గా పరిగణించి వరవరరావును 15 రోజులపాటు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో వైద్యం అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చికిత్స అందించింది.