నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుళ్ళ బెయిల్ రద్దు చేయాలంటూ కోరిన జగన్
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ.. సెల్ఫీ వీడియో తీసి, ఆ తర్వాత కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న షేక్ అబ్దుల్ సలామ్ ఘటనకు కారకులై అరెస్టు అయిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ల బెయిల్ రద్దుకు కర్నూలు ఎస్పీ ద్వారా ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది.
నాన్ బెయిలబుల్ సెక్షన్ (ఐపీసీ సెక్షన్–34లోని సెక్షన్–306) కింద అరెస్టు అయినప్పటికీ బెయిల్ ఎలా వచ్చిందని ఆరా తీసిన సీఎం వైయస్ జగన్, వెంటనే సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
దీంతో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు ఇచ్చిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలంటూ కర్నూలు ఎస్పీ స్థానిక సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చట్టాన్ని అమలు చేసే పోలీసు వృత్తిలో ఉన్న ఇద్దరు నిందితులు, ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, తద్వారా కేసు దర్యాప్తు సజావుగా సాగదని, దీని వల్ల బాధితులకు న్యాయం జరిగే వీలు లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది.
ఈ మేరకు పలు అంశాలను బెయిల్ రద్దు పిటిషన్‌లో ప్రస్తావించారు.
– ప్రత్యక్ష సాక్షులు ఇద్దరు నిందితులను నేరుగా వేలెత్తి చూపుతున్నారు.
– నిందితులకు బెయిల్ ఇవ్వడం వల్ల ఆ సాక్షులను బెదిరించి, భయపెట్టి కేసు దర్యాప్తును ఆటంకపర్చే అవకాశం ఉంది.
– ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ (306) కింద కేసులు నమోదయ్యాయి.
– ఆత్మహత్యకు ముందు సెల్ఫీలో ఆ కుటుంబ సభ్యులు, ఈ ఇద్దరు నిందితుల పేర్లనే ప్రస్తావించారు.
- ఇంత బలంగా సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై నేరారోపణలు ఉన్న నేపథ్యంలో, వారికి బెయిల్ ఇవ్వడం ఏ మాత్రం సరికాదని, అందువల్ల వెంటనే ఆ బెయిల్‌ను రద్దు చేయాలని కర్నూలు ఎస్పీ తన పిటిషన్‌లో కోరారు.
-పోలీసు నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వమే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా తప్పు ఎవరు చేసినా.. ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.