సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (20:58 IST)

మానవ హక్కులను హరిస్తున్న జగన్‌ ప్రభుత్వం: టిడిపి, సిపిఐ

ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అమరావతి రాజధానికి తమ భూములను త్యాగం చేసిన దళిత, బడుగుబలహీనవర్గాల రైతులకు తీవ్రవాదుల మాదిరిగా సంకెళ్లు వేయడం దారుణమని, తద్వారా రాష్ట్రంలో మానవ హక్కులను హరిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

అమరావతి రైతులను తీవ్రవాదుల మాదిరిగా సంకెళ్ల వేయడాన్ని నిరసిస్తూ శనివారం గోకవరం బస్టాండు సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అమరావతి రాజధానికి ప్రతిపక్ష నాయకుడిగా నాడు మద్దతు పలికిన నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు మూడు రాజధానుల పేరుతో మాట మార్చి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేడు అదే దళితులపై దమనకాండకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అమరావతినే రాజధానిగా ఉంచాలని గత 13 నెలలుగా శాంతియుత మార్గంలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులను నేడు కరుడకట్టిన నేరస్తులుగా చూస్తూ చేతులకు సెంకెళ్లు వేసి జైళ్లపాలు చేస్తున్నారని అన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

తక్షణమే దళిత రైతులను విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, దళిత రైతులకు సంకెళ్లు వేసేందుకు కారకులైన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసేందుకు ప్రయత్నించడంతోపాటు, పోలవరం ప్రాజెక్టును సైతం గంగలో కలిపేసేస్తున్నారని మండిపడ్డారు.

పూటకో విధానం అన్న రీతిలో ఇసుక, మద్యం పాలసీలను తీసుకొస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క అంశంపైనా నిర్ధిష్టమైన విధానం లేకుండా పాలన సాగిస్తూ అసమర్థ, చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన చూస్తుంటే తుగ్లక్‌ గుర్తుకు వస్తున్నాడని, రైతు రాజ్యం చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డి తీవ్రవాదుల మాదిరిగా అమరావతికి చెందిన దళిత రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుచేటన్నారు.

మాట మార్చను...మడమ తిప్పను అని చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డి గత ఏడాదిన్నర పాలనలో ప్రతీ విషయంలోనూ మాట తప్పడమే కాకుండా మడమను తిప్పారని, రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని అన్నారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్‌ సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలికి వినతిపత్రాన్ని అందించారు.
 
ఈ కార్యక్రమంలో తాటిపాక మదు,నల్లా రామారావు,పాలిక శ్రీనివాస్,నక్కా చిట్టిబాబు,మార్గాని సత్యనారాయణ,వెలుగుబంటి ప్రసాద్, వంగమూడి కొండలరావు,యడ్ల అప్పారావు,బి.రవి,గంగిన హనుమంతరావు, మత్సేటి ప్రసాద్, పిన్నంటి ఏకబాబు,ప్రత్తిపాటి పుల్లారావు,ఆళ్ల ఆనందరావు, నిమ్మలపూడి రామకృష్ణ,నీలి కోటేశ్వరరావు,తలారి మూర్తి,నాల్ల రమేష్,బత్తిన బ్రదర్స్,

మల్లిపూడి శ్రీను,కోడమంచిలి సూర్య,బీమరశెట్టి రమేష్,కామిని బాస్కర్,శీలం గోవింద్, కోప్పిశెట్టి చిన్ని,ఇనుమర్తి రమణ,నరసింహా మూర్తి, పురెడ్ల శేషు,ఆడ్డగర్ల ఆనంద్, గాడి శ్రీను, మంత్రమూర్తి రాంబాబు,నల్లం ఆనంద్,కోమ్మ రమేష్,యమ్.యమ్.ఎల్ రాజు,పెద్దఎత్తున నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.