శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:02 IST)

గత ఎన్నికల్లో టీడీపీకి గోచి కూడా పోయింది: అంబటి సంచలన వ్యాఖ్యలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గోచిగుడ్ఠ కూడా ఊడదీశారని, ఇంకా ఏం మిగిలి వుందని ఆ పార్టీ ఎగిరెగిరి పడుతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవాచేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...!
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన స‌మావేశాన్ని బ‌హిష్కరిస్తున్నామ‌ని చాలా స్పష్టంగా చెప్పడం జ‌రిగింది. ఎన్నికల కమిషన్ కు ఉండే  స్వతంత్ర ప్రతిప‌త్తిని ఒక రాజ‌కీయ పార్టీకి తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకువ‌చ్చారు.  ఇది దేశంలోనే అంద‌ర్నీ ఆశ్చర్యపరిచే అంశం. 
 
చివ‌ర‌కు ఒక్క ఓటు కూడా లేని రాజ‌కీయ పక్షాల‌ను కూడా ఈరోజు సమావేశానికి పిలిచారు, ఇదే ఎన్నికల కమిషనర్ కరోనా పేరు చెప్పి ఆరోజు స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజ‌కీయ పార్టీల‌ను పిల‌వ‌లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆరోజు మీ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉండబట్టే, ఎవ‌ర్నీ సంప్రదించ‌లేదు అన్నది మీ చర్యల ద్వారా రూఢీ అవుతుంది. 
 
ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆరోజు కేవలం 3-4 క‌రోనా కేసులు ఉంటే, నేడు రోజుకు 3వేలుపై చిలుకు కేసులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే పరిస్థితి ఉంది. 
 
2018లో జరపాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ జరపలేదు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల‌ను బ‌లోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని నాడు సహకరించాం. అయితే, కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్థాంతరంగా కోవిడ్ పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేశారు. 
 
నిన్న, ఇవాళ సీయ‌స్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో  మాట్లాడుతున్నానని చెబుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను పిల‌వాల‌ని నిర్ణయించక ముందే ఎందుకు వీరిని సంప్రదించ‌లేదు, అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్టు స్పష్టం కావడం లేదా..?
 
ఎన్నిక‌ల క‌మిష‌న్ గా కాదు "చంద్రబాబు - నిమ్మగ‌డ్డ జాయింట్ క‌మిష‌న్" గా వ్యవ‌హరిస్తున్నారు. ఒక రాజ‌కీయ పార్టీకి తొత్తుగా త‌యారైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా ఎన్నిక‌లు జ‌రుపుతారంటే ఎవ‌రు న‌మ్ముతారు..?
 
గతంలో ఎన్నికలను వాయిదా వేసిన వెంటనే.. 18వ తారీఖున కేంద్ర హోం శాఖ సెక్రటరీకి ఒక లేఖ రాశారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పార్టీ అని,  అక్రమాల పార్టీ అని, ఫ్యాక్షనిస్టుల పార్టీ అని రాశారు. ఆ లేఖ‌ చంద్రబాబు రాయిస్తే నిమ్మగడ్డ సంత‌కం పెట్టి.. మళ్ళీ ప్రాణ ర‌క్షణ లేద‌ని మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో డ‌బ్బులు, లిక్కర్ పంచితే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే.. దానికి, ఎన్నికల క‌మిష‌న్ కు ఏం సంబంధం..?
 
క‌రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ‌న్ టూ వ‌న్ స‌మావేశాలు పెట్టి, రాజకీయ పార్టీల నాయకుల్నే అంద‌ర్నీ ఒకచోట కుర్చోబెట్టలేని పరిస్థితుల్లో మనం ఉండి,  ఈ పరిస్థితుల్లో ఎన్నిక‌లు పెట్టాలంటే ఎలా కుదురుతుంది..? రాజ‌కీయం పార్టీల నుంచి రిప్రజంటేష‌న్ తీ‌సుకుని, రాజ‌కీయం చేయాల‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా రాజ‌కీయ డ్రామాలు ఆడే దౌర్భాగ్యమైన ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది మీరు కాదా?

- రాజకీయ పార్టీల నేతలతో వ‌న్ టూ వ‌న్ సమావేశాలా..? ఒక‌రు మాట్లాడింది మ‌రొక‌రికి తెలియ‌కూడ‌దా..? ర‌హ‌స్యంగా ఎందుకు మాట్లాడాలి, ఇలాంటి ర‌హ‌స్య మంత‌నాలు చేసే ధోర‌ణి కుట్ర రాజ‌కీయం కాక మరేమిటి..?
 
హైద‌రాబాద్ లో చీక‌ట్లో స్టార్ హోట‌ల్స్ లో తెలుగుదేశం పార్టీవారితో  కుమ్మక్కై నిమ్మగడ్డ సాగించిన రహస్య మంతనాలను రాష్ట్ర ప్రజలు అంద‌రూ చూశారు. అలాంటి పెద్ద మనిషి చ‌ట్టబ‌ద్ధంగా ఎన్నిక‌లు నిర్వహిస్తానంటే న‌మ్మాలా?

ఇంత దుర్మార్గమైన వ్యవ‌హార‌న్ని ఏపీలో న‌డుపుతున్నారు. వ్యవ‌స్థల్లో చంద్రబాబు ప‌ర‌కాయ ప్రవేశం చేశారు, ర‌మేష్ గారిలో చంద్రబాబు ప‌ర‌కాయ ప్రవేశం చేసి ఆయ‌న చెప్పినట్టుఅల్లా ఆడే ఈ క‌మిష‌నర్ ఎంత వ‌ర‌కు చ‌ట్టబ‌ద్ధంగా వ్యవ‌హ‌రిస్తారో ప్రజలకు తెలియ‌దా..?
 
మొన్న జ‌రిగిన ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలని టీడీపీ, మరికొన్ని పార్టీలు డిమాండ్ చేశాయంటున్నారు. ఇక ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఎందుకు..? మీకు నచ్చనట్టే, స్థానిక సంస్థలు అన్నీ ర‌ద్దు చేసి, జిల్లా పరిష‌త్ ఛైర్మన్లు, మండ‌ల పరిషత్ అధ్యక్షులుగా ఎవ‌ర్ని చేయాల‌నుకుంటున్నారో వారిని ఎన్నికల కమిషనర్ నే నామినేట్ చేయ‌మ‌ని చెప్పి ఉంటే బాగుండేది..! ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరించవద్దు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. రాజకీయ కుట్రలో ఎన్నికల కమిషనర్ భాగస్వామ్యం కావొద్దు.. రాజ్యాంగ వ్యవస్థలను కూల్చాలనుకుంటే అంతిమంగా మీరే కూలుతారు తప్పితే, ప్రజాస్వామ్యంలో మీ కుట్రలు ఎంతో కాలం నిలబడవు. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఏనాడూ భయపడదు. ఎన్నికలు జరగాలని మేమూ కోరుకుంటున్నాం. కరోనా తగ్గాక ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ ఎన్నికల్లో తప్పక గెలిచేది మేమే. కరోనా వైరస్ వ్యాప్తి లో ఒక దశ పోయింది, రెండో దశ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జనజీవనానికి ఇబ్బంది లేకుండా కొంత వెసులుబాటు కల్పించినా మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని చెబుతున్నారు.

కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెట్టే ఆలోచన చేయాలి. అలా చేయకుండా, కేవలం ఏదోరకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే విషపూరితమైన ఆలోచనతో నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నాడు. దీనిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిమ్మగడ్డ రాజకీయ  పార్టీలతో సమావేశాలు, నిర్ణయాలన్నీ ఒక డ్రామా మాదిరిగా నడిపిస్తున్నారు తప్పితే.. ఆయన చర్యల్లో ఎటువంటి నిజాయితీగానీ, చిత్తశుద్ధి గానీ లేదు. నిమ్మగడ్డ చర్యల వల్లే దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. 
 
నిమ్మగడ్డ రమేష్ ఎక్కడైనా పారదర్శకంగా వ్యవహరించాడా...? ఒక్క ఉదాహరణ చెప్పండి.  ప్రతి చోటా చంద్రబాబు కుట్రలో భాగంగానే వ్యవహరించాడు. ఆరోజు కేంద్రానికి రాసిన లేఖ మొదట తాను రాయలేదు అని, మళ్ళీ తానే రాశానని చెప్పాడు. తెలుగుదేశం ఆఫీసుకు, కమిషనర్ ఆఫీసుకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి..? తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఆ లేఖ ఎందుకు లీకు అయింది..?

ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలన్న కుట్రలో అది భాగం కాదా..? నిమ్మగడ్డ తరఫున వాదించిన న్యాయవాదులు ఎంత ఖరీదు అయిన న్యాయవాదులు, వారికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, ఎక్కడ నుంచి వచ్చాయి.. ఇవన్నీ ప్రజలకు తెలుసు. 
 
రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తే.. రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్టు పడతాయి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ ను ను భ్రష్టు పట్టించిన వ్యక్తులుగా నిమ్మగడ్డ-నారా చంద్రబాబు నాయుడులు మిగులుతారు.
 
18 మాసాల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో  జగన్ మోహన్ రెడ్డి చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు వల్ల మేం గెలవబోతున్నాం అన్నది మేం చెప్పటం కాదు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకూ తెలుసు. ఏదో విధంగా ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలనే తప్ప వారికి మరో ఉద్దేశం లేదు.  ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భయపడదు. కోవిడ్ తగ్గాక  జరగబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు. బంపర్ మెజార్టీతో గెలుస్తాం. 
 
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏం మిగిలింది, కొత్తగా మునగటానికి, ఆ పార్టీ పూర్తిగా మునిగిపోయిన పార్టీ. ఇక వారు భయపడటానికి ఏముంది..? వంటి మీద గోచీ కూడా లేకుండా గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వారిని 23 సీట్లకు పడేసి మూలన కూర్చో బెట్టారు.