శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:23 IST)

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు స్పష్టత వస్తుందా?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని కోరనున్నారు.

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది.

రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతోనూ దీనిపై చర్చించనున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ కారణంగా వాయిదాపడ్డాయి. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. 

ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత పరిణామాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్‌ను ఏకంగా ఆ పదవి నుంచి తొలగించింది. అయితే దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసినప్పటికీ న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ దృష్టి సారించారు.