1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:00 IST)

6న 'జగనన్న తోడు' ప్రారంభం

చిరు వ్యాపారులకు వరంగా మారనున్న జగనన్నతోడు పథకాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6న ప్రారంభించనున్నారు. పుట్ పాత్ లు, వీధుల్లో వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, గంపలు / బుట్టలు మీద వస్తువులు అమ్ముకునేవారు ఈ పథకం కింద లబ్ది దారులుగా ఉన్నారు.

అలాగే సాంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేయువారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి మొదలైన వారిని కూడా లబ్ది దారులుగా చేర్చారు.

రోజువారీ అవసరాలకు వీరు చిన్న చిన్నమొత్తాలను వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకొని దాన్ని సకాలం లో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ప్రభుత్వమే వీరందరికి జగనన్నతోడు పథకం కింద ఎటువంటి పూచికత్తులేకుండా 10 వేల రూపాయల వరకు బ్యాంకు ద్వారా రుణాన్ని అందిస్తుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 9.08 లక్షల మంది చిరు వ్యాపారాలు, సాంప్రదాయ వృత్తిదారులు లబ్ది పొందనున్నారు.
474 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వీరికోసం ఖర్చు చేయనుంది. ఈ ఋణం మీద సంవత్సరానికి వచ్చేటువంటి రూ: 52 కోట్ల వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

అసలు మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకొనకపోతే గ్రామ లేదా
వార్డు వాలంటీరు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.