బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (09:10 IST)

జగన్ జే-ట్యాక్స్ వల్లే రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలు: టీడీపీ

వైసీపీ ప్రభుత్వం వింతపోకడలతో ముందుకెళుతోందనడానికి, నిన్నటి కేబినెట్ సమావేశంలో తీసుకున్ననిర్ణయాలే నిదర్శనమని, సహజంగా మంత్రివర్గ సమావేశమంటే, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలుంటాయని అందరూ ఆశగా ఎదురు చూస్తుంటారని, అందుకు విరుద్ధంగా నిన్నటి సమావేశం దొంగలబండిలాసాగిందని, టీడీపీనేత, మాజీ విప్ కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని సహజ వనరులను ఎలాదోచుకోవాలి, దోపిడీ విధానాలను కేబినెట్లో చర్చించి, వాటినెలా ఆమోదింపచేసుకోవాలనే లక్ష్యం సుస్పష్టంగా నిన్నటి కేబినెట్ సమావేశంలో కనిపించిందన్నారు. రాష్ట్రంలోని భవననిర్మాణ కార్మికులకు ఎటువంటి ఆసరా లేకుండా, కొత్తఇసుకపాలసీ విధానమనే నిర్ణయాన్ని పాలకులు తీసుకోవడం జరిగిందని కూన స్పష్టంచేశారు.

గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత ఇసుకవిధానాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు రద్దుచేసిందో చెప్పాలన్నారు. ఇసుకను దోపిడీ చేయడానికే, పాతపాలసీని రద్దుచేసి, సరికొత్తపాలసీని వైసీపీప్రభుత్వం తీసుకొచ్చిందని రవికుమార్ మండిపడ్డారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక రూ. 700 – 800లు ఉంటే,నేడు అదే ఇసుక ట్రాక్టర్ రూ.4వేలు పలుకుతోందన్నారు. ఆనాడు లారీ ఇసుక వేలల్లో లభిస్తే, నేడు లక్షల్లో పలుకుతోందన్నారు.

భవననిర్మాణ కార్మికులకు ఉపాధిలేకుండా చేసే కొత్తఇసుకపాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం, 30లక్షలమంది భవననిర్మాణరంగ కార్మికులపొట్ట కొట్టిందన్నారు. ఇసుకపాలసీకి సంబంధించి, వైసీపీప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు కోరుతూ, సాక్షి పత్రికలో ప్రజలసొమ్ము రూ.20కోట్లు వెచ్చించిమరీ ప్రకటనలిచ్చిందన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలే ఇసుక మొత్తం దోచుకుంటున్నారు.. తనదాకా రావడం లేదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి,   ప్రజాభిప్రాయసేకరణ చేసినట్లుగా మభ్యపెట్టి, నేడు గంపగుత్తుగా ఏపీలోనిఇసుక మొత్తాన్ని ఒక్కరికే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నాడన్నారు. తనకు వచ్చే జే –ట్యాక్స్ గురించే జగన్ ఆలోచించాడు తప్ప, కొత్తపాలసీలో ప్రజలఅభిప్రాయాలను ఆయన పట్టించుకోలేదని కూన స్పష్టంచేశారు.

జగన్ తీసుకొచ్చిన మద్యం విధానం ద్వారా వేలకోట్లరూపాయలు ఆయనకు కమీషన్ రూపంలో అందుతున్నా యని, ఆ మొత్తం ఏడాదికి రూ. 5 నుంచి రూ.6వేలకోట్ల వరకు ఉంటుందన్నారు. సిమెంట్ బస్తాకి రూ.10చొప్పున జే-ట్యాక్స్ ని వసూలుచేస్తున్నారని, దానివల్ల కంపెనీలు సిమెంట్ ధరలు పెంచేశాయన్నారు. జగన్ తీసుకొచ్చిన కొత్తఇసుకవిధానం కూడా అదే కోవకు చేరుతుందన్నారు.

దేశంలో ఏరాష్ట్రంలోనైనా సరే, ఇసుక నిర్వహణను కేంద్రప్రభుత్వసంస్థలు చేపట్టిన దాఖాలాలున్నాయా అని కూన రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు.  నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ, కోల్ ఇండియా సంస్థలు , ఐరన్ ఓర్ కి చెందిన సంస్థలు వాటిపరిధిలోని ఖనిజవనరులు, సహజవనరులను మాత్రమే పర్యవేక్షిస్తుంటాయన్నారు.

రాష్ట్రపరిధిలోని ఇసుక రీచ్  ల నిర్వహణను, ఏకేంద్రప్రభుత్వసంస్థ చేపట్టలేదన్నారు. మైనర్ మినరల్ గా గుర్తించిన ఇసుకనిర్వహణ ను కేంద్రప్రభుత్వసంస్థలు ఏనాడూ, ఎక్కడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలోని ఇసుకమొత్తాన్ని కొత్తరెడ్డిగారికి అప్పగించడంకోసం, ఆయనద్వారా వేలకోట్లరూపాయలు కమీషన్ గా పొందడంకోసమే జగన్మోహన్ రెడ్డి నిన్నటి కేబినెట్ సమావేశంలో కొత్తఇసుకపాలసీని తెరపైకి తేవడం జరిగిందని కూన తేల్చిచెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఇసుకను దండుకుంటున్నారని, దానివల్ల తనదాకా రూపాయికూడా చేరడం లేదని భావించిన జగన్మోహన్ రెడ్డి,  ఈ కొత్తవిధానాన్ని సృష్టించాడన్నారు. ప్రజలంతా జగన్ నిర్ణయాలను గమనిస్తూనే ఉన్నారని, ఆయన అవినీతికి అంతులేకుండా పోతోందని వారికి అర్థమైందన్నారు.

రాష్ట్రాన్ని ఇప్పటికే రెడ్లరాజ్యంగా మార్చిన జగన్, ఉత్తరాంధ్ర ప్రాంతాన్నివిజయసాయికి, కోస్తాఆంధ్రా ప్రాంతాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, రాయలసీమ భాగాన్ని వై.వీ.సుబ్బారెడ్డికి అప్పగించారని, వారంతా అవినీతిరాజులుగా మారి, రాష్ట్రాన్ని మూడుముక్కలుచేసి పంచుకుతింటున్నారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేమాదిరి ఇసుకనుకూడా మూడు ప్రాంతాలవారీగా విభజించి, ముగ్గురు రెడ్లకు కట్టబెట్టి, వారిద్వారా జే-ట్యాక్స్ వసూలచేయాలని జగన్ ఆలోచిస్తున్నాడని రవికుమార్ ఆరోపించారు.

జగన్ విధానం కారణంగా ప్రజలకు ఇసుక లభించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినట్టేనన్నారు. రాష్ట్రంలోని ఇసుకను, పక్క రాష్ట్రంలోఇసుకమాఫియా కింగ్ గా వెలుగొందుతున్న శేఖర్ రెడ్డికి అప్పగించాలని నిర్ణయించడమే జగన్ సరికొత్తఇసుక విధానమని కూన తెలిపారు. పాత విధానాన్ని రద్దుచేస్తే, ప్రజలంతా తమకు మరింత మెరుగ్గా, తేలికగా ఇసుక లభిస్తుందని భావించారని, కానీ వాస్తవంలో పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు.

కేంద్రప్రభుత్వ సంస్థల పేరుతో, ఇసుక నిర్వహణను ముగ్గురు రెడ్లకు అప్పగించాలనే జగన్ దొంగనాటకాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. శాండ్ మైనింగ్ కార్పొరేషన్ పేరుతో గతంలో ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేశారో, దానిద్వారా సులభమైన పద్ధతిలో ప్రజలకుఇసుక అందించేలా చేయకుండా, ఇప్పుడు మరోకొత్తపద్ధతికి, ముఖ్యమంత్రి ఎందుకు శ్రీకారంచుట్టారో చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు. 

ప్రైవేట్ వారికే ఇసుక నిర్వహణను అప్పగిస్తే, ప్రభుత్వం ఏర్పాటుచేసిన శాండ్ కార్పొరేషన్ ఏంచేస్తుందో చెప్పాలని, రాష్ట్రంలోని ఇసుకమొత్తాన్ని ఒక వ్యక్తికే పరాధీనంచేస్తే, అతనెలా రాష్ట్రమంతటికీ ఇసుకసరఫరా చేస్తాడో చెప్పాలని కూన డిమాండ్ చేశారు.

భవననిర్మాణరంగం  సంక్షోభం తీరాలంటే, నిర్మాణరంగ కార్మికుల సమస్యలు తీరాలన్నా,  రాష్ట్రంలో నిర్మాణరంగం వేగంగా పుంజుకోవాలన్నా, గతప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుకవిధానమే మేలని టీడీపీనేత సూచించారు. ఈ విషయాలన్నీ ఆలోచించే, ఆదాయాన్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబునాయుడు ఉచిత ఇసుకవిధానాన్ని అమలుచేసి, 30లక్షల మంది భవననిర్మాణ రంగకార్మికులను ఆదుకోవడం జరిగిందన్నారు.

జగన్ జే-ట్యాక్స్ విధానాలవల్ల నిర్మాణ రంగ కార్మికులతో పాటు, అనుబంధరంగాలవారు కూడా దారుణంగా దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రంలోని సహజవనరులను కూడా రెడ్లపరం చేసి, దోపిడీచేయాలనే తనప్రయత్నాలను జగన్ తక్షణమే మానుకోవాలని కూనరవికుమార్ డిమాండ్ చేశారు.