గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (07:43 IST)

బూతుల్లో మంత్రులు ఒకరికి ఒకరు పోటీ : బుద్దా వెంకన్న

రాష్ట్రమంత్రుల్లో కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలు, ప్రవర్తనచూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రజలతో ఛీకొట్టించుకోవడం ఇష్టంలేకనే తాముఇంగితంతో మాట్లాడుతున్నామని టీడీపీఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి అప్పలరాజు  తాటాకు చప్పుళ్లకు టీడీపీలో ఎవరూ భయపడరన్నారు. రైతులంటే ఎప్పుడూ గోచీలు పెట్టుకొనే ఉంటారనే భావనలో మంత్రి అప్పలరాజు ఉన్నట్లున్నాడని,  రైతులు విమానమెక్కి ఢిల్లీ వెళతారా అంటూ అవహేళనగా మాట్లాడటం చూస్తుంటే, ఆయనకు రైతులపై ఎంతచిన్నచూపు ఉందో అర్థమవుతోందన్నారు.

విమానాలు ఎక్కకుండా, కార్లలో తిరగకుండా, బురదలో బతికేవారే రైతులన్నట్లుగా మంత్రిమాటలు ఉన్నాయన్నారు. మంత్రి అప్పలరాజు రైతులనుఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డికి   ఏమాత్రం బాధకలిగినా, ఆయన తక్షణమే అప్పలరాజుని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. రైతులపై దురభిప్రాయంతో ఉన్నమంత్రి, తనపార్టీ ఎంపీలకు చెప్పి, వారు విమానాల్లో తిరగకుండా పార్లమెంట్ లో చట్టం చేయిస్తే మంచిదని వెంకన్న హితవు పలికారు.

మంత్రి రైతు పండించిన అన్నం తింటన్నాడో...లేక మరేదైనా తింటున్నాడో తెలియడం లేదన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి నిండా మూడువారాలు కూడా కాలేదని, మంత్రి మదం, అహం, గర్వం, కొవ్వు పతాకస్థాయికి చేరాయని వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వ్యాఖ్యలను, ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోకుంటే, అమాత్యుడు  రైతులపై చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించినట్లేనన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు పులివెందుల పులిరాజుల్లా మాట్లాడుతున్నారని, రాజశేఖర్ రెడ్డిహాయాంలోకూడా ఇలా మాట్లాడేవారిని చూడలేద న్నారు. తాము ఇటువంటి వారికి ఓట్లేశామా అని ప్రజలంతా ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారన్నారు.  

జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఏదీ సరిగా అమలుకావడం లేదని, వాహనదారులకు రూ.10వేలు ఇచ్చినట్లే ఇచ్చి, ఎక్కువమందిని ఎక్కించుకుంటున్నారంటూ, తిరిగి వారినుంచి వసూలు చేస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన పదివేలతోపాటు రెట్టింపు సొమ్ముని, విద్యుత్, పెట్రోల్-డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా తిరిగి ఖజానాకే వచ్చేలా చేశారన్నారు. 

జగన్ వచ్చాక రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలు వేరే విధంగా ఉన్నాయన్న వెంకన్న వాటిలో తొలిరత్నం  - దళితులపై దాడులైతే, రెండో రత్నం- రైతులుపై దాడులని, మూడోరత్నం – మహిళలపై దాడులు, అత్యాచారాలు, నాలుగోరత్నం – ప్రతిపక్షనేతలపై దాడులు, వేధింపులని, 5వరత్నం – వైద్యులపై దాడులైతే, 6వరత్నం – పారిశ్రామికవేత్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడటంతోపాటు, వారి కంపెనీలు, పరిశ్రమల్లోని షేర్లను బలవంతంగా వైసీపీనేతలు రాయించుకోవడమని, 7వరత్నం – న్యాయమూర్తులపై, న్యాయస్థానాలపై దూషణలని, ఎనిమిదో రత్నం- హిందూదేవాలయాలపై దాడులైతే, 9వరత్నంగా – కార్పొరేషన్ల నిర్వీర్యాన్ని జగన్ అమలుచేస్తున్నాడన్నారు. 
 
ఈ విధంగా తానుప్రకటించిన నవరత్నాలకు పూర్తివిరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి సరికొత్త నవరత్నాలను అమలుచేస్తున్నాడని బుద్దా ఎద్దేవాచేశారు. ప్రతిపక్షనేతలకు చేవలేక, చేతగాక మాట్లాడటం లేదనుకోవద్దని, అధికారపార్టీ వారికంటే తాము అధికంగానే తిట్టగలమని, కానీ ప్రజలదృష్టిలో పలుచనకావడం ఇష్టంలేకనే ఓర్పుతో వ్యవహరిస్తున్నామన్నారు. 

మంత్రుల వ్యాఖ్యలను డీజీపీ సుమోటాగా తీసుకొని, తక్షణమే వారిపై కేసులు నమోదుచేయాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధా డిమాండ్ చేశారు. 

రామ్మోహన్ నాయుడిని, అచ్చెన్నాయుడిని రాజీనామా చేయాలంటున్న మంత్రి అప్పలరాజు, తన ప్రభుత్వం విశాఖలో రాజధాని పెట్టాలని భావిస్తోంది కాబట్టి, ఆప్రాంత వైసీపీఎంపీతో  రాజీనామా చేయిస్తే, అక్కడే ప్రభుత్వంతో తేల్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.  వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో ఇప్పటికే విశాఖ వాసులు బెంబేలెత్తుతున్నారని, అక్కడ ప్రభుత్వానికి ఎంత బలముందో, ఎంతటి ప్రజాదరణ ఉందో తేల్చుకోవాలంటే, విశాఖ ప్రజాప్రతినిధులతోనే రాజీనామా చేయించాలని బుద్దా పత్రికాముఖంగా డిమాండ్ చేశారు.

మంత్రులు బూతుల్లో పోటీపడుతున్నారుతప్ప, శాఖలనిర్వహణలో,ప్రజలకు సేవచేయ డంలో కాదని వెంకన్న దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి కూడా వారికి బూతులు తిట్టడంలో ర్యాంకింగ్ లు ఇస్తున్నాడని, అందుకేవారు వాటిలో ఒకరినిమించి ఒకరు పోటీ పడుతున్నా రన్నారు.

కృష్ణాజిల్లాలో మొదలైన మంత్రుల బూతుల పంచాంగం శ్రీకాకుళం వరకు పాకిందన్నారు. తన అంతుచూస్తామని బెదిరించేవారు ఏంచేస్తారో చేసుకోవచ్చని, టీడీపీకోసం, నిజాయితీ పరుడైన చంద్రబాబుకోసం తాము చావడానికి సిద్ధంగానేఉన్నామని వెంకన్న తేల్చిచెప్పారు. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు.