గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (10:17 IST)

సిమంట! ఇక ఇల్లు క‌ట్టేదెలా? సామాన్యులు, బిల్డర్ల‌ గగ్గోలు!

ఆగస్టు నెలాఖరు వరకూ సిమెంటు బ‌స్తా ధ‌ర రూ.340. నేడు బస్తా రూ.400 - రూ.420. ఇదొక్క‌టే కాదు స్టీల్ ధ‌ర కూడా భారీగా పెరిగిపోయింది. వైజాగ్‌ స్టీల్‌ టన్ను రూ.62 వేలు. ఇతర బ్రాండ్లు రూ.59 వేలు. ఇక ఇల్లు క‌ట్టేదెలా? అని సామాన్యులు, బిల్డ‌ర్లు గ‌గ్గోలుపెడుతున్నారు.
 
భవన నిర్మాణాలకు అవసరమైన స్టీల్‌, సిమెంట్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఇసుక సంగతి సరేసరి. ఎంత రేటు చెల్లిస్తామన్నా దొరకని దుస్థితి. మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోయినా స్టీల్‌ రేట్లు పెరగడంపై వినియోగదారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం మార్కెట్‌లో వైజాగ్‌ స్టీల్‌ ధర టన్ను రూ.62 వేలు పలుకుతోంది. అదే ఇతర బ్రాండ్లు అయితే రూ.59 వేలు చొప్పున విక్రయిస్తున్నారు.
 
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. వర్షాకాలం కావడంతో పనులు కూడా జరగడం లేదు. రాజధానిగా విలసిల్లిన అమరావతిలో  ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి రెండేళ్లు అవుతోంది. అయినా రేట్లు పెరగడం ఏమిటో అంతుచిక్కడం లేదు. గత జూలై వరకు మార్కెట్‌లో స్టీల్‌, సిమెంట్‌ విక్రయాలు జోరుగా సాగాయి. ఆగస్టులో మందగించాయి. ఇప్పుడూ అదే పరిస్థితి. అయినా రేట్లు పెరిగిపోతున్నాయి. 
 
సిమెంట్‌ విషయానికి వస్తే ఆగస్టు ఆఖరి వారం వరకు బస్తా రూ.340కు విక్రయించారు. ఇదే సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసే కాంట్రాక్టర్లకు బస్తా రూ.240 చొప్పున ఇస్తూ వచ్చింది. బిల్డర్లు, గృహాలు నిర్మించుకునే వారి మీదే మార్కెట్‌ నడిచింది. తాజాగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి సిమెంట్‌ విక్రేతలు సిండికేట్‌గా మారి రేటు పెంచేశారు. బస్తా రూ.400 నుంచి రూ.420 వరకు పెంచేశారు. ఈ రేటుకు అంగీకరిస్తేనే లోడు పంపుతామని చెబుతూ డిస్పాచ్‌ ఆపేశారు. దాంతో మార్కెట్‌లో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. 
 
ఇలాగైతే గృహాలు నిర్మించుకునేది ఎలా అంటూ మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ లేని సమయంలో కూడా రేట్లు పెంచుకుంటూ పోతే, తమ వ్యాపారాలు ఎలా సాగాలి? అంటూ బిల్డర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలుదారులకు ముందుగా మాట ఇచ్చిన రేటుకు ఫ్లాట్లను ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. స్టీల్‌, సిమెంట్‌ రేట్లు పెరిగాయని, ఎస్‌ఎఫ్‌టీ రేటు పెంచడానికి వీల్లేదంటున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి, ధరలు తగ్గించడానికి తగిన చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.