ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా మాధవరెడ్డి బాధ్యతలు స్వీకరణ
గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఎస్.వి.మాధవరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్ధానంలో పి.జాషువా బదిలీకాగా, మాధవ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి)గా ఉన్నారు.
కడపకు చెందిన మాధవరెడ్డి 2010లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్-1కు ఎంపికై పోలీసు శాఖలో వివిధ పదవులను సమర్ధంగా నిర్వహించి వన్నె తెచ్చారు. శిక్షణ అనంతరం తొలుత కర్నూలు జిల్లా ఆత్మకూరు, నిర్మల్‌లలో డిఎస్పిగా పనిచేసి 2018లో అదనపు ఎస్పిగా పదోన్నతి పొందారు.
తదుపరి కర్నూలు అదనపు ఎస్పి (పరిపాలన)గా పనిచేసి గుర్తింపు పొందారు. విజయవాడ ట్రాఫిక్ డిసిపిగా రహదారి భద్రతకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించారు.
తన సర్వీసు కాలంలో నాలుగేళ్ల పాటు ఫారెస్టు రేంజ్ అధికారిగా పనిచేసి అటవీ చట్టాల పట్ల పూర్తి అవగాహన గడించారు. బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు తావు లేని విధంగా విజిలెన్స్ నిఘాను పటిష్టపరుస్తామన్నారు.