బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (19:23 IST)

ఏ గ్రామంలో మద్యం అమ్మటం లేదో చెప్పండి?: వైసీపీకి యరపతినేని సవాల్

ఏపీలోని ఏ గ్రామంలో మద్యం అమ్మడంలేదో చెప్పాలని టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే  యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.
 
యరపతినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్నాడులో వైసీపీ నాయకులు గాలి, నీరు కూడా వదిలిపెట్టకుండా అక్రమ వ్యాపారంలో మునిగి తేలుతూ ఉన్నారని, దీనికి ఉదాహరణగా మాచవరం మండలంలో మట్టిని కూడా వదలకుండా, వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకుంటూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నారని విమర్శించారు.

పిడుగురాళ్ళ, దాచేపల్లిలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్,అక్రమ ఇసుక వ్యాపారం,అక్రమ మద్యం వ్యాపారం విచ్చలవిడిగా చేస్తూన్నారని, రోజూ 5 లారీల మధ్యన్ని డోర్ డెలివరీ చేసి నియోజకవర్గంలో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. అదే విధంగా గుట్కా వ్యాపారం, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని, పిడుగురాళ్ల లో మిల్లులు తీసుకుని రోజుకు 15 లారీల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మరల గవర్నమెంట్ కే ఆ బియ్యాన్ని ఎక్కువ ధరకి అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో కూడా అక్రమాలను చేస్తూ, పనులు చేయకుండా పెద్ద ఎత్తున బిల్లులను డ్రా చేస్తూ ఉన్నారని, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఒక మాఫియాగా చేసి తెగబడి, బరితెగించి అక్రమ వ్యాపారం చేస్తూన్నారని, కంట్రోల్ చేయవలసిన అధికారులు చోద్యం చూస్తూ పట్టనట్లుగా ఉన్నారని మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్రమాలు ఏ గ్రామాల్లో జరుగుతున్నాయో చూపెట్టమని అంటున్నాడని, ఎక్కడ అక్రమాలు జరగడం లేదో మీరే చెప్పాలన్నారు. డోర్ డెలివరీ ద్వారా మద్యం అమ్ముతున్నారని, ఏ గ్రామంలో మద్యం అమ్మటం లేదో మీరు చెప్పండి? ఏ గ్రామంలో గుట్కాలను అమ్మటం లేదో మీరు చెప్పండి అని ప్రశ్నించారు.