70వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన
రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 70వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి.
పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఐఏఎల్ అండ..
రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు అండగాల నిలవాలని ఐఏఎల్(ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్) మహాసభ తీర్మానించింది. ఐదు చట్టాల్లో చేయాల్సిన సవరణలతోపాటు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.
ఇదిలా వుండగా.. దుగ్గిరాల తహసీల్దారు తమపై బనాయించిన అక్రమ కేసుల్ని కొట్టివేయాలంటూ తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ధనేకుల రామారావు, నూతక్కి శ్రీదేవి తదితర 24 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 19న మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని ప్రభుత్వ, సీఆర్‌డీఏ భూములు సర్వే చేసేందుకు వచ్చిన దుగ్గిరాల తహసీల్దారు మల్లీశ్వరి వాహనాన్ని కొందరు అడ్డుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆ సమయంలో తహసీల్దారు అనేందుకు ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదని, పైగా దుగ్గిరాల తహసీల్దారుగా ఉన్న ఆమెకు ఇతర మండలాల్లో సర్వే చేసే అధికారం లేదని, అందుకు అనుమతులూ లేవని తెలిపారు.
కదిలిస్తే అరిష్టం
రాజధాని అమరావతిని కదిలిస్తే అరిష్టమేనని స్వామి కమలానంద భారతి అన్నారు. బీజేపీపైనే అమరావతి అబివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత ఉందని కేంద్రంతో తాను అమరావతి విషయంపై మాట్లాడినట్టు చెప్పారు.
కేంద్రం కూడా అమరావతికి సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. సోమవారం రాజధాని అమరావతి ప్రాంతమైన అనంతవరం స్వయంభువు భూదేవీ శ్రీదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం అనంతవరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు.