శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (17:58 IST)

రాయపాటిపై సీబీఐ కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఉదయం సాంబశివరావు నివాసంలో సోదాలు నిర్వహించిన సీబీఐ అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీతోపాటు రాయపాటికి సంబంధం ఉన్న పలు కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో.. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, దిల్లీలో ఈ సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై 120 (బి), రెడ్ విత్ 420, 406, 468, 477 (ఏ), పీసీఈ యాక్ట్ 13 (2), రెడ్ విత్ 13 (1) డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నవంబరు 18న సీబీఐకి యూనియన్ బ్యాంకు ప్రాంతీయ హెడ్ ఎస్.కె.భార్గవ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్ ట్రాయ్ డైరక్టర్ సూర్యదేవర శ్రీనివాసబాబ్జీలను సీబీఐ నిందితులుగా చేర్చింది.