బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా నేతల వేధింపులు - పంచాయతీ మహిళా కార్యదర్శి ఆత్మహత్య

suicide
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ (32) ఆత్మహత్య చేసుకుంది. అధికార పార్టీ నేతల ఒత్తిడి, వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత 2019లో ఆమె పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తర్వాత పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సివుంది. కానీ, 90 రోజులు అయినప్పటికీ సమావేశం నిర్వహించలేదు. 
 
ఇదే అంశంపై ఆమెపై కొందరు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆమె తీవ్ర మనస్తాపానికిగురైంది. పైగా, తనపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ఫిర్యాదుదారులు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ డబ్బును కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెపై వేధింపులు అగలేదు. దీంతో మనస్తానికి లోనైన భవానీ ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే మృతదేహాన్ని తరలించాలని పట్టుబట్టారు. వారికి పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. భవానీ భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.