బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (19:55 IST)

ఛలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తత : కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో చేపట్టిన ఛలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్ మార్గం మీదుగా రాజ్‌భవన్‌ వెళ్లేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేడు రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు.
 
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఈ చట్టంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అదేవిధంగా సీఎం కేసీఆర్‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సవాల్‌ విసిరారు. శాంతియుతంగా రాజ్‌భవన్‌ ముట్టడికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ చేసిన నాయకులను పోలీసులు ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. 
 
ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్‌ గారు, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.