శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (21:17 IST)

ఆ భయం నేరస్థుల్లో కలిగించాం.. తెలంగాణ వ్యాప్తంగా 6% తగ్గిన నేరాలు: డీజీపీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
 
‘నేరం చేస్తే దొరికిపోరతామనే భయం నేరస్థుల్లో కలిగించాం. స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చాం. నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోకి మావోయిస్టుల పునఃప్రవేశాన్ని పోలీసుల సమష్టి కృషితో అడ్డుకున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పూర్తిగా విజయవంతమైంది. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారు’ అని డీజీపీ పేర్కొన్నారు.
 
అన్ని రకాల నేరాలు తగ్గాయి..
‘గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6 శాతం తగ్గాయి. హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం, రహదారి ప్రమాదాలు 13.9 శాతం, వైట్‌కాలర్‌ నేరాలు 42 శాతం తగ్గాయి. 48.5 శాతం మంది నేరస్థులకు శిక్ష పడింది. ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 135 మంది మావోయిస్టులు లొంగిపోయారు’ అని డీజీపీ వివరించారు.