మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (07:57 IST)

ఓటమి కంటే.. ఓడిన తీరే బాధగా ఉంది : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కొందరు పార్టీ సీనియర్ నేతలు కలుసుకున్నారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో గెలుపొందిన కొందరు నేతలు ఆయనతో సమావేశమై ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. ప్రధానంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయం చెందడంపై వారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఈ ఓటమిపై టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ముఖ్యంగా, ఐదేళ్ళపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలచుకుంటే బాధ కలుగుతుంది సార్ అని చంద్రబాబుతో పలువురు నేతలు అన్నారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసు.. కానీ తప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అధ్యయనం చేయాల్సివుందన్నారు. 
 
అసలు ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ నమ్మలేక పోతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం.. ఒకవేళ ఓడినా మెజారిటీ మార్కుకు 10 లేదా 15 సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాం. కానీ ఇంత ఘోరమైన పరాభవమా? అంటూ ఆయన నేతల వాపోయినట్టు సమాచారం. ఈ ఓటమి కంటే.. ఓడిన తీరు చాలా బాధగా ఉందన్నారు. 
 
మనకు కేవలం పాతిక సీట్లే వచ్చాయా? విపక్షానికి 151 సీట్లా? నమ్మశక్యంగా లేదన్నారు. అంటే మనం నిజంగా అంత ఘోర తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.