మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (12:43 IST)

శ్రీవారి ఆశీస్సుల వల్లే ఉన్నతస్థాయికి చేరుకున్నా : జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శుక్రవారం ఉదయం జస్టిస్ రమణ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని తెలిపారు.
 
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తిరుమలకు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. శుక్రవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణకు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. 
 
ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు ఎన్వీ రమణ దంపతులకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు. తర్వాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. 
 
ఆ తర్వాత శుక్రవారం మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ ర‌మ‌ణ హైదరాబాద్‌కు రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయన తొలిసారి రాష్ట్రానికి వ‌స్తుండ‌డంతో ఆయ‌న‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికేందుకు తెలంగాణ స‌ర్కారు ఏర్పాట్లు చేసింది. 
 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జస్టిస్ రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో జస్టిస్‌ రమణ బస చేస్తారు. ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులూ స్వీక‌రించే అవ‌కాశం ఉంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు.