భూముల రీసర్వే ప్రాజెక్టుపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి: అజయ్ కల్లాం
భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స్థాయి స్టీరింగ్, ఇంప్లిమేంటేషన్ కమిటీ ఛైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రీసర్వే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.
గురువారం సచివాలయంలో రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోగా, కమిటీ సభ్యులు విభిన్న అంశాలపై లోతుగా చర్చించారు. ఈ నేపధ్యంలో సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల కమీషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ రీసర్వే పనులకు అవసమైన పరికరాల కోనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. డ్రోన్లు, రోవర్స్ సమీకరణకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించారని వివరించారు.
కీలకమైన సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఆధునిక సాంకేతికతతో వేగంగా పనులు చేసే క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించు కోనున్నామని, మరోవైపు గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్‌ను సమకూర్చుకోవాలని కమిటీ చైర్మన్ అజయ్ కల్లాం ఆదేశించారన్నారు.
తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న అర్బన్ సర్వే పైలెట్ ప్రాజెక్టు పూర్తి కానుండగా, త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని ఆ శాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, డిటిసిపి అధికారులు పాల్గొన్నారు.