గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:52 IST)

తెలుగు రాష్ట్రాల్లో మరో 500 ఆలయాల నిర్మాణం: టిటిడి

హిందూ ధర్మ ప్రచార ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ర్టాల్లో రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి సమరత సేవా ఫౌండేషన్‌, సంస్కృతి సంవర్థిని సంస్థల ద్వారా శ్రీకారం చుట్టాలని టిటిడి ఈవో డాక్టర్‌ కెయస్‌ జవహర్‌ రెడ్డి సూచించారు.

ఏపిలో సమరసత సేవా ఫౌండేషన్‌ కార్యక్రమాలు చక్కగా వున్నాయని ప్రశంసించారు. ఆ సంస్థ నిర్వహిస్తోన్న బాలవికాస కేంద్రాలకు ఆధ్యాత్మిక,దేశభక్తి పెంపొందించే పుస్తకాలు పంపాలని అధికారులు ఆదేశించారు.

ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.మారు మూల గ్రామాల్లోని  ఎస్సీ, ఎస్టీ మత్య్సకార కాలనీల్లో అర్చక వృత్తిపై ఆధార పడ్డవారికి షోడశ సంస్కారాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని హెచ్‌డిపిపి అధికారులను ఆదేశించారు.

తెలుగు రాష్ర్టాల్లో ఇదివరకే  టిటిడి నిర్మించిన 500 ఆలయాల్లో కల్యాణోత్సవం ప్రాజెక్టు ద్వారా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలన్నారు. ఈ ఆలయాల కోసం టిటిడి ఇప్పటికే కొనుగోలు చేసిన మైకుసెట్లు,గొడుగులు,భజన సాదమగ్రీ,పెన్‌డ్రైవర్‌ల ద్వారా అన్నమయ్య సంకీర్తనలను అందించాలని కోరారు.

ఏపిలో సమరసత సేవా ఫౌండేషన్‌ తెలంగాణాలో సంస్కృతి సంవర్థిని సంస్థల ద్వారా 500 ఆలయాలనిర్మాణానికి అనుమతి కోసం రాబోయే హెచ్‌డిపిపి కార్యవర్గ సమావేశానికి  ప్రతిపాదనలను పమర్పించాలని ఈవో చెప్పారు. టిటిడి రూ 10 లక్షల వరకు సమకూర్చనుందని ఈవో వెల్లడించారు.

ఆలయాల నిర్మాణానికి అనువైన స్థల ఎంపిక చేసే బాధ్యతను ఆరెండు సంస్థలకు అప్పగించారు. గ్రామ గ్రామాన హిందూ ధర్మ విస్తృత ప్రచారం కోసం టిటిడి ధర్మరధాలు సిద్ధం చేస్తోందన్నారు. ఇవి రాగానే ఇప్పటికే నిర్మించిన 500 ఆలయాలకు వెళ్లేలా రూట్‌మ్యాయప్‌ తయారు చేయాలన్నారు.

ఆయా గ్రామాల్లోని శ్రీవారి భక్తులకు తిరుమలలో శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లో వున్న టిటిడి కల్యాణ మండపాలను ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.