గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (18:30 IST)

మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు కొనసాగింపు: మంత్రి బొత్స

మరో తుఫాను రానున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, కంట్రోల్ రూంలను కొనసాగించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని స్పష్టం చేశారు.

వరద నీటి నిల్వ కారణంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన మంచినీటి ట్యాంకులు, చెరువులకు గళ్లు పడకుండా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం కలిగించేలా, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడంతోపాటు, పూడుకుపోయిన డ్రైన్లను శుభ్రం చేయాలని అన్నారు.

పంపిణీ చేస్తున్న తాగునీరు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన క్లోరినేషన్ ప్రక్రియను చేయడంతోపాటు, ఇళ్ల వద్ద ఉన్న కుళాయిల వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాల్లోని వసతులపై  కమిషనర్ల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుని, ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

తుఫాను, భారీ వర్షాల అనంతరం నీటి నిల్వల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి  సూచించారు. 
 
అనంతరం టిడ్కో గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ, లబ్ధిదారులకు అర్హతా పత్రాల అందచేత, బ్యాంకు రుణాల టైఅప్ అంశాన్ని వేగవంతం చేయాలని, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఇందుకు సంబంధించిన పనులన్నీ సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని, లబ్ధిదారులకు సరైన,సక్రమమైన సమాచారాన్ని చేరేవేసేందుకు, వార్డు సెక్రటరీల సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.

అంతే కాకుండా వార్డు సెక్రటరీలకు వారి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉన్నత స్థాయి శిక్షణా తరగతులను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
మున్సిపల్ స్కూళ్లలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ, నిర్దేశిత కాలపరిమితిలోగా, పాఠశాలల భవనాలకు మరమ్మత్తులు చేపట్టాలని, అన్ని వసతులను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు.

అలాగే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి బిపిఎస్, ఎల్ఆర్ ఎస్ లలో పథకాల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనధికార కట్టడాలు, లే అవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయంలో రాజీలేదన్నారు.