శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (08:04 IST)

వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా చర్యలు: మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదనీరు తగ్గుముఖం పట్టగానే, పట్టణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల అంశాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

ముఖ్యంగా నీటి నిలవ కారణంగా ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా రేపటి నుంచి 3 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, డ్రైనేజిలను శుభ్రం చేయడం వంటి పనులు చేయాలని ఆయన నిర్దేశించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన  ఆదేశాలకు అనుగుణంగా, ప్రతి ప్రాంతంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు.  పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్‌రావు తదితర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్సులో  పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, 365, 430 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్లాట్ల దరఖాస్తు దారులకు  వచ్చే వారం పదిరోజుల్లో అర్హత ధృవీకరణ పత్రాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఇప్పటికే వివిధ దశల్లో గుర్తించిన అర్హులైన వారందరికీ ఈ పత్రాలు అందించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, మెప్మా అధికారుల ద్వారా ఆయా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సులభంగా లభించేలా చూడాలన్నారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు. 

అనంతరం పట్టణ ప్రణాళికా విభాగపు(టౌన్ ప్లానింగ్ ) పనితీరును సమీక్షిస్తూ క్రమపద్ధతిలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో ఇటీవల తీసుకుని వచ్చిన  సరళీకరణ విధానాలకు అనుగుణంగా కమిషనర్లందరూ నిర్దేశిత కార్యక్రమాలను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

భవిష్యత్తులో ఎటువంటి అనధికార లే అవుట్లు, అక్రమ కట్టడాలు లేకుండా చూడాలన్న లక్ష్యంతో ఇప్పిటికే పలు చర్యలు తీసుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.అనధికార లే అవుట్లు, భవనాల గుర్తింపు, ఆన్‌లైన్ లో నమోదు ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో టిడ్కో ఎండి శ్రీధర్, డిటిసిపి రాముడు మెప్మా ఎండి విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.