కేసీఆర్‌ది సెల్ఫ్ పొలిటికల్ సూసైడ్ : సీపీఐ నారాయణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ సభ్యుడు కె.నారాయణ మరోమారు విమర్శలు సంధించారు. ఆర్టీసీ కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ కాదన్నారు. కానీ సీఎం కేసీఆరే... సెల్ఫ్ పొలిటికల్ సూసైడ్‌కి సిద్ధమయ్యారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమానికి సకల జనుల సమ్మెలా అన్ని పక్షాలు సహకరిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 14 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సాగుతోంది. దీంతో తెలంగాణ సర్కారుపై ఎన్.హెచ్.ఆర్.సికి కె. నారాయణ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, టీఎన్జీవోలను గుప్పిట పట్టేందుకు కేసీఆర్ చూశారన్నారు. ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు ఆహుతయ్యారని గుర్తుచేశారు. ఇంకెంతమంది బలిదానాలు ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది బలిదానాలు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ కూర్చొన్నారన్నారు.
అయితే, రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీయే కారణమన్న ఆయన.. ఆరు నెలల ముందే ఎన్నికలకు సహకరించారని ఆరోపించారు. ఎలా బోల్తాపడేశారో.. సోనియాను చేసినట్టే బీజేపీని బోల్తాపడేశారన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కలిపి జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల అంశంలో కేంద్రం కల్పించుకొని.. తెరాస సర్కార్‌కు ముకుతాడు వేయాలని, ఈ నెల 19వ తేదీన చేపట్టిన సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.