ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదు.. సమ్మె విరమించండి.. హైకోర్టు
ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని, తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర హైకోర్టు సూచన చేసింది. తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమ్మె విరమించాలని ఆదేశించింది. పండుగలు, పాఠశాలల సమయంలో సమ్మె చేయడం ఎంతవరకు సమంజసం అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనలకు అనేక పద్దతులు ఉన్నాయి కదా అని యూనియన్లను నిలదీసింది. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చా? చట్టాన్ని ఉల్లంఘించవచ్చా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించింది.
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే పరిస్థితేంటని అడిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీని విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లు కూడా డిమాండ్ చేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. అదేసమయంలో ప్రస్తుతం 75 శాతం బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేసింది.