1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (18:36 IST)

సంక్రాంతికైనా గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల‌కు పే స్కేలు ఇవ్వండి

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లక్ష్యంగా, గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా 2019 అక్టోబర్ 2 న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సీఎం వాటి సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ‌కృష్ణ ఆరోపించారు. అందులో వాలంటీర్లతో సహా పలు విభాగాలకు ఉద్యోగులను నియమించార‌ని, ఎపిపిఎస్సీ ద్వారా సచివాలయాల్లో నియమించిన వీరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంద‌న్నారు. నవరత్న పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వీరు ప్రధాన పాత్ర వహిస్తున్నార‌ని,  కరోనా విపత్కర కాలంలో సచివాలయ ఉద్యోగులు ప్రాణాలను కూడా లెక్కచేయక తమ విధులు నిర్వర్తించి కీలకపాత్ర పోషించార‌న్నారు. 
 
 
సచివాలయ ఉద్యోగులు చాలామంది పేద, సామాన్య కుటుంబాలకు చెందినవారు. వీరి కుటుంబాలకు రైస్కార్డు, పెన్షన్ల వంటి తదితర సంక్షేమ పథకాలు తొలగించినప్పటికీ ఆదర్శవంతంగా పనిచేస్తున్నార‌న్నారు. కరోనాతో పోరాడి పలువురు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయార‌ని, వీరి గురించి ప్ర‌భుత్వం ఆలోచించ‌డం లేద‌న్నారు. 
 
 
ఆనాడు వీరికి రూ .15 వేలు కన్సాలిడేటెడ్ పే ఇచ్చి, రెండేళ్లు సర్వీస్ పూర్తయిన తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేసి, పే స్కేల్ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని, సచివాలయ ఉద్యోగులు చాలా మంది పేద, సామాన్య కుటుంబాలకు చెందినవార‌న్నారు. వీరి కుటుంబాలకు రైస్ కార్డు, పెన్షన్ల వంటి తదితర సంక్షేమ పథకాలు తొలగించినప్పటికీ ఆదర్శవంతంగా పనిచేస్తున్నార‌ని, గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టి ఇప్పటికి 28 నెలలు గడిచింద‌ని తెలిపారు.  ఇవి రెగ్యులర్ ఉద్యోగాలేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని, రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తుందని ఎదురు చూస్తున్నార‌న్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నార‌ని చెప్పారు. 
 
 
సంక్రాంతి పండుగ సందర్భంగానైనా గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తిచేసి, పే స్కేల్ అమలుచేసి, వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కె.  రామకృష్ణ కోరారు.