1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (17:47 IST)

విశాఖ ఏజెన్సీలో శిశు మరణాలపై గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ ఆందోళన

ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న శిశు మరణాలపై ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల, గిరిజన ప్రాంతాల పాలనాధికారిగా హోదాలో తన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాను ఇందుకు సంబంధించి నివేదిక తీసుకోవాలని కోరారు. దాని అధారంగా తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేసారు. 
 
 
విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం పాతరూడకోట శిశు మరణాల సంఖ్య పెరుగుతుండడంపై  సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ కోరారు. పాతరుడకోట గ్రామంలో పలు గిరిజన తెగలకు చెందిన 138 కుటుంబాలు నివసిస్తూ ఉండగా, 2018 మే నుండి 14 మంది శిశువులు మృతి చెందిన విషయాన్ని వివరించారు. గత తొమ్మిది నెలల్లోనే ఎనిమిది శిశు మరణాలు నమోదుకాగా, అన్ని మరణాలు పుట్టిన మూడు నెలల్లోనే జరిగాయని స్పష్టమైంది.
 
 
చాలా కాలం క్రితం వేసిన మంచినీటి గొట్టాలు తుప్పు పట్టి తాగునీరు కలుషితం కావడంతో పాటు, తల్లుల్లో కాల్షియం లోపమే శిశు మరణాలకు కారణమని సమగ్ర విచారణలో తేలింది. దీనితో వెంట‌నే తాగునీటి పైప్‌లైన్‌ను మార్చటంతో పాటు, అత్యవసర వైద్య సేవ కోసం రెండవ అంబులెన్స్ అందించే ఏర్పాటు చేశారు. అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు విశాఖపట్నం కెజిహెచ్ నుండి ఒక మల్టీ-స్పెషలిస్ట్ వైద్య బృందం గ్రామాన్ని సందర్శించింది. స్థానికులతో సంభాషించి, నీరు, మట్టి తదితర నమూనాలను పరిశీలించారు. నవజాత శిశువుల పెంపకంలో అవగాహనా లేమి, చిన్నారుల శ్వాసకోశ వైఫల్యం కూడా శిశు మరణాలకు కారణమని వైద్యులు కనుగొన్నారు. దీంతో గ్రామంలో తక్షణ సేవల కోసం స్టాప్ నర్పును నియమించారు.
 
 
ముంచేంగిపుట్టులో ప్రసవాల కోసం వేచిఉండే కేంద్రంలో బాలింతలతో పాటు పాలిచ్చే తల్లులు బస చేసేందుకు, గర్భిణులకు, బాలింతలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. స్ధానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంకు తాగునీటి పైపులైన్‌ను ఏర్పాటు చేసారు. ఏజెన్సీ ప్రాంతంలో సరైన కమ్యూనికేషన్ సౌకర్యాల ఏర్పాటు, రుద్రకోట, పాతరూడకోట గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణం, నివాస గృహాల నిర్మాణం వంటి దీర్ఘకాలిక చర్యలను కూడా తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల, గిరిజన ప్రాంతాల పాలనాధికారి హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేసారు.


ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉండాలని, భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు సంభవించ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియాను అదేశించారు.