సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (16:55 IST)

పంచదార కోటా త‌గ్గించేశారు... కందిప‌ప్పు రేటు పెంచేశారు!

నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని నిత్యావసర సరుకులు రేషన్ డిపోల ద్వారా అందించాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్. బాబూరావు డిమాండు చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని రేషన్ డిపోలు, రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించి ప్రజలతో బాబురావు, సిపిఎం నేతలు మాట్లాడారు. 

 
వెయ్యి మంది కార్డులు ఉన్న డిపోలో 200 మందికి మాత్రమే పంచదార, అది కూడా అరకిలో
అందిస్తున్నార‌ని, ప్రతి కార్డు దారుడికి అరకిలో అందించాల్సి ఉన్నా, గత కొద్ది నెలల నుండి పంచదార కోటాలో కోత పెట్టార‌ని ఆరోపించారు. కొన్ని డిపోలలో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కందిపప్పు కిలో అందిస్తున్న గతంలో 40 రూ. ధరను 67 రూపాయలకు పెంచార‌ని, ఇక సామాన్యుల‌కు ఏం ఉప‌యోగ‌మ‌ని ప్ర‌శ్నించారు.
 

పంచదార ప్రతి రేషన్ దారుకు కిలో అందించేవార‌ని, ఇపుడు దానిని అర కిలోకి తగ్గించార‌ని, అదీ అర కిలో 17 రూపాయలకు పెంచార‌ని తెలిపారు. పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిపివేశార‌ని, ఇతర నిత్యావసర సరుకులు డిపోల ద్వారా అందించడం లేద‌ని ఆరోపించారు. అధిక ధరలతో ప్రజల సతమతమవుతున్నాప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించడం శోచనీయం అని బాబూరావు విమ‌ర్శించారు. ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ స్పందించి అన్ని నిత్యావసర వస్తువుల ద్వారా అందించాల‌ని, తగ్గించిన పంచదార కోటాను పునరుద్ధరించాల‌ని, పామాయిల్ కూడా సరఫరా గతంలో వలే చేయాల‌న్నారు.
 
 
డిపోల ద్వారా నాణ్యమైన బియ్యం అందించాల‌ని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అధిక ధరలను నియంత్రిస్తుందని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల‌న్నారు. ఒక వైపున కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింద‌ని, మరోవైపు విద్యుత్ చార్జీలు వివిధ రూపాల్లో భారం పడుతోంద‌ని అన్నారు. కూరగాయల మొదలు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయ‌ని, ఈ తరుణంలో పేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రజలను ఆదుకోవాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను
పటిష్ఠం చేయాల‌న్నారు. గతంలో వలే వంట గ్యాస్ మూడు వందల రూపాయలకు తగ్గించాల‌ని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు బి రమణారావు, కే దుర్గారావు తదితరులు
పాల్గొన్నారు.