బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:28 IST)

ఆంధ్రా బ్యాంకు విలీనం పై సిపిఎం, సిపిఐ ఆగ్రహం.. 3న నిరసనలు

ఆంధ్రా బ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 3న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి.

ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రంలోని ఉన్న అన్ని ఆంధ్రాబ్యాంకు బ్రాంచీల వద్ద నిరసనలు తెలపాలని పిలుపునిచ్చాయి.

విజయవాడ దాసరి భవన్‌లో ఆగష్టు 31న నిర్వహించిన సిపిఎం, సిపిఐ రాష్ట్ర బాధ్యుల సమావేశంలో సిపిఎం తరుపున పి మధు, వి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, సిపిఐ తరపున కె రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవివి సత్యనారాయణ, జల్లి విల్సన్‌ పాల్గొన్నారు.

బ్యాంకుల రద్దు, విలీనాన్ని సమావేశం తప్పుబట్టింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చాక బిజెపి దూకుడుగా వ్యవహ రిస్తోందని, ప్రజాసమస్యల్ని పక్కదారి పట్టించడానికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందని సమావేశం భావించింది.

కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని, రాష్ట్రాల హక్కులపై దాడులను సమావేశం విమర్శించింది.

రాష్ట్రానికి చట్టబద్దంగా, న్యాయబద్దంగా రావాల్సిన ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు తదితర అంశాల అమల్లో బిజెపి చేస్తున్న అన్యాయంపై ''ప్రజల హక్కులపై దాడి-కేంద్ర ప్రభుత్వ విధానాలు'' పేరుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సదస్సులు, సభలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు.