శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (22:51 IST)

సైబర్ నేరగాళ్ల వలలో బ్యాంకు ఉద్యోగి... రూ. 29లక్షలు స్వాహా

cyber hackers
సైబర్ నేరగాళ్ల వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నగదు మాయమైంది. ఈ ఘటన విశాఖలోని ద్వారాకా నగర్‌లోని యూనియన్‌ బ్యాంకులో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే., విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో యూనియన్‌ బ్యాంకులో మహాలక్ష్మి ఆటో ఏజెన్సీకి అకౌంట్‌ ఉంది. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి నుంచి బ్యాంకు ఉద్యోగికి వాట్సాప్‌ మెసేజ్‌, కాల్‌ అందింది. తన చెక్‌బుక్‌ అయిపోయిందని, వెంటనే అకౌంట్‌కు డబ్బు జమచేయాలని ఫోన్‌లో కోరాడు. 
 
ఏ నెంబర్‌కు డబ్బు జమ చేయాలనేది మెసేజ్‌ రూపంలో పంపాడు. ఈ విషయాన్ని సదరు ఉద్యోగిపై అధికారికి తెలిపాడు. సదరు ఏజెన్సీ యజమాని వంశీకృష్ణ అడుగుతున్నట్లుగా భావించిన బ్యాంకు సిబ్బంది.. ఇంతకు ముందు ఫోన్‌ చేసిన వ్యక్తి సూచించిన బ్యాంక్‌ అకౌంట్‌కు రూ.3.90 లక్షలు బదిలీ చేశారు. 
 
ఆ తర్వాత మరో మూడు అకౌంట్లకు రూ.8.72 లక్షలు, రూ.8.67 లక్షలు, రూ.7.87 లక్షలు పంపాలని మెసేజ్‌వచ్చింది. ఈసారి పై అధికారికి చెప్పకుండానే సదరు ఉద్యోగి ఆ మూడు అకౌంట్లకు డబ్బు బదిలీ చేశాడు.
 
తన అకౌంట్‌ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించిన మహాలక్ష్మీ ఆటో ఏజెన్సీ యజమాని వంశీకృష్ణ.. బ్యాంకు మేనేజర్‌కు ఫోన్‌ చేశాడు. అయన స్పందించకపోవడంతో ఆయనే బ్యాంకుకు వచ్చి విషయం చెప్పడంతో అక్కడి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. 
 
మోసం జరిగిందని తెలిసిన వెంటనే నిందితుల అకౌంట్లను బ్యాంకు ఉన్నతాధికారులు ఫ్రీజ్‌ చేశారు. అయితే, ఫ్రీజ్‌ చేసేలోపు సైబర్‌ మోసగాళ్లు ఎంత డబ్బును విత్‌డ్రా చేశారో తెలియాల్సి ఉంది.