గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (12:12 IST)

ఆంబోతుల మాదిరి బజారున పడితే సహించేది లేదు: చంద్రబాబు

దాచేపల్లి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మనిషి ఒక మృగంలా బతకడానికి వీల్లేదన్నారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు

దాచేపల్లి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మనిషి ఒక మృగంలా బతకడానికి వీల్లేదన్నారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన చాలా బాధాకరమని.. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. 
 
తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం దారుణమంటూ పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. బాధితురాలికి సంఘీభావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 
 
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని సీఎం తెలిపారు. ఆంబోతుల మాదిరి బజారున పడితే సహించేది లేదన్న ఆయన ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. దాచేపల్లిలో దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని.. ఈ దురాగతాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. 
 
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 
 
అరాచకాలను ప్రతిఘటించాలని... ఆడపిల్లలు అబలలుగా కాకుండా సబలలుగా మారాలని సూచించారు. ఆడబిడ్డలకు రక్షగా... కదులుదాం పేరిట సోమవారం నిర్వహించే ప్రజా చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని.. మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు అన్నివర్గాల వారు పాల్లొనాలని పిలుపునిచ్చారు.