ఉపరాష్ట్రపతి - సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు : పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు
ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ కేసులు నమోదు చేశారు.
ఈ ముగ్గురుతో పాటు.. మరికొందరు ప్రముఖులను కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో యూట్యూబ్‌పైనా కేసు నమోదు చేసిన స్పెషల్ సెల్ పోలీసులు సంస్థకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా పంచ్ ప్రభాకర్ వీడియోలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని యూట్యూబ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, పంచ్ ప్రభాకర్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వైసీపీ విదేశీ విభాగం సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని, పెద్దలపై అసభ్య పోస్టులు పెట్టినందుకు అతడిని ఢిల్లీకి రప్పిస్తున్నారని వివరించారు.
మరి, మన రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు, జడ్జిలపై పంచ్ ప్రభాకర్ అసభ్య పోస్టులు పెట్టాడంటూ ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు. మరి అతనిపై చర్యలు ఉంటాయా డీజీపీ గారూ? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు