కేంద్రం వర్సెస్ ట్విట్టర్.. ఉద్యోగుల భద్రతపై ట్విట్టర్ ఆందోళన.. ఏమవుతుందో..?
భారత కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా అగ్రగామి ట్విట్టర్‌కు మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. కేంద్ర సర్కారుపై విమర్శలకు ట్విటర్ సహకారిగా ఉంటోందనే ఆరోపణలుండగా, సోషల్ మీడియా నియంత్రణ కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై టెక్ సంస్థలు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ట్విటర్ మరో అడుగు ముందుకేసి, భారత్‌లోని తన ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా మోదీ సర్కారు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఇప్పటికే కోర్టులో న్యాయపోరాటానికి దిగింది. గూగుల్ సంస్థ మాత్రం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, ట్విటర్ సంస్థ మాత్రం కొత్త ఐటీ నిబంధనలపై మెలిక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల అమలుకు ఆరు నెలల గడువు కావాలని కోరింది.
అంతటితో ఆగకుండా, కొత్త విధానాలతో భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, ఇండియాలో పనిచేస్తోన్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు ట్విటర్ ప్రతినిధులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రజల సేవలకు ట్విట్టర్ ఎప్పటికీ కట్టుబడి వుంటుందని బహిరంగ చర్చల్లో ట్విట్టర్ కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేసింది.
కరోనా కాలంలో ట్విట్టర్ ప్రజలకు అండగా నిలిచిందని రుజువు చేసింది. అలాంటి మా సేవలను అందుబాటులో ఉంచడం కోసం భారత్‌లోని కొత్త చట్టాలను పాటించేందుకు ప్రయత్నిస్తాం. అయితే పారదర్శకంగా ఉండే సూత్రాలను మాత్రమే కొనసాగిస్తాం. మా సేవల ద్వారా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించేందుకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటాం'' అని ట్విట్టర్ ప్రకటనలో పేర్కొంది.
కొత్త ఐటీ చట్టాల ద్వారా భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశముందని ట్విటర్ ఆందోళన వ్యక్తం చేసింది. ''గత కొంతకాలంగా భారత్‌లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయనే మా ఆందోళన '' అన్న ట్విటర్.. ఇటీవల ఢిల్లీలోని తమ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడాన్ని తప్పుపట్టింది. దాన్నొక బెదిరింపు చర్యగా అభివర్ణించింది.