మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (21:50 IST)

బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తోంది... టీడీపీ

వైసీపీ దురాగతాలకు బలైన తెలుగుదేశం కారకర్యలకు న్యాయం చేయాలని,  ప్రభుత్వ బాధితులను ఆదుకోవాలని టీడీపీ పోరాటం చేస్తుంటే, వారికి వ్యతిరేకంగా కక్షసాధింపు ధోరణితో రివర్స్‌లో కేసులు పెడుతూ, బాధితుల్నే దోషుల్ని చేస్తూ వారినే పోలీస్‌స్టేషన్లకు తరలించడం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం విజయవాడలో డీజీపీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో బాధితుల్ని, నష్టపోయిన వారిని దోషులుగా చిత్రీకరిస్తూ, దాడిచేసిన వారిని, టీడీపీ కార్యకర్తల ఆస్తులు, పొలాలు ధ్వంసం చేసిన వారినేమో బాధితులుగా చిత్రీకరించే కుట్రకు తెరలేపిందని డొక్కా వాపోయారు.

ఈ తరహాచర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిదికాదన్న ఆయన, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే రెచ్చగొట్టేలా, అధికారులు అత్యుత్సాహంతో దుందుడుకు చర్యలకు పాల్పడటం సరికాదని హితవుపలికారు. ఉభయపక్షాలను సమావేశపరిచి, శాంతిభద్రతలను కాపాడాల్సినవారే దాడులుచేసే వారికి కొమ్ముకాయడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.

ఆత్మకూరు సంఘటనల తర్వాత శాంతిభద్రతలు రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని మాణిక్యవర ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

మాపార్టీ అధినేతను కలవడానికి వెళ్తున్న టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడిని బలవంతంగా నిర్బంధించడం ఏమిటని, ఒక్కడే ఆయన కారులో వెళ్తుంటే అడ్డుకొని, ఉండవల్లిలో కేసునమోదైతే, పాతకేసులంటూ టెక్కలి పోలీసులు అరెస్ట్‌కు యత్నించడం ఎంతవరకు సమంజసమని డొక్కా ప్రశ్నించారు.

సోషల్‌మీడియాలో కూడా మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా, అభ్యంతరకరంగా  వైసీపీవాళ్లు చేస్తున్న వ్యాఖ్యలను, పోలీసులు ఎందుకు నిరోధించలేకపోతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గారిని, ఆయన కుటుంబసభ్యులను దూషిస్తూ, సోషల్‌మీడియాలో  జరిగిన అసభ్య ప్రచారాన్ని ఈ సందర్భంగా డొక్కా ప్రస్తావించారు.

టీడీపీవాళ్లు, బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు, వైసీపీ వారిచ్చే ఫిర్యాదులపై మాత్రం మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విషయాలను కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
 
ఆడబిడ్డలపై అసభ్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలేవి: పోతుల సునీత
రాష్ట్రంలో ఒక్క ఆత్మకూరు గ్రామంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న దాడులను నిలువరించడానికి టీడీపీ అధినేత 'ఛలో ఆత్మకూరు' కి పిలుపునిచ్చారని  తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత తెలిపారు.

ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్న ఆమె, వైసీపీ సర్కారు వచ్చిన తొలిరోజు నుంచీ, ప్రజావేదిక కూల్చివేత సహా, అనేక అనాలోచిత చర్యలకు పాల్పడిందన్నారు.

ప్రభుత్వ చర్యలవల్ల రాష్ట్రంలోని మహిళలందరూ, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఉత్సాహంగా ఉండే స్త్రీలపై అసభ్య ప్రచారం జరుగుతోందని పోతుల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళను గౌరవించడం చేతగానివారికి ప్రభుత్వం వత్తాసు పలకడం, దూషణలు చేస్తున్న వారిని వెనకేసుకురావడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళే ఉన్నప్పటికీ, నవ్యాంధ్రలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్న సునీత, రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై జరుగుతున్న దురాగతాలపై తెలుగుదేశం పార్టీ తరుపున డీజీపీని కలిసి తెలియచేయడం జరిగిందన్నారు.