సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (09:32 IST)

చెన్నై టెక్కీ ప్రాణం తీసిన అన్నాడీఎంకే నేత ఇంటి పెళ్లికి కట్టిన ఫ్లెక్సీ

చెన్నైలో దారుణం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే నేత ఇంట జరిగే పెళ్లి ఆహ్వానం పేరిట తయారు చేసి ఏర్పాటు చేసిన బ్యానర్ పడి ఓ యువతి దుర్మరణం పాలైంది. ఈ యువతి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆ బ్యానర్ ఉన్నఫళంగా ఆమెపై పడింది. దీంతో ఆ యువతి నడుతూ వచ్చిన వాహనం అదుపు తప్పి... తాగునీటి ట్యాంకర్ లారీ కింద పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పళ్లికరణికి చెందిన శుభశ్రీ (22) అనే యువతి నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసి, దురైపాక్కంలో ఉన్న ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. ఆమె గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన విధులను ముగించుకుని తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది.
 
ఆమె పళ్లికరణి ప్రధాన రహదారిలో వెళుతోంది. అయితే, ఆ రోడ్డులో అప్పటికే అధికార అన్నాడీఎంకేకు చెందిన మాజీ కౌన్సిలర్ తన ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి ఆహ్వానం పేరుతో తయారు చేయించిన బ్యానర్లను రోడ్డు డివైడర్‌కు మధ్యలో ఏర్పాటు చశారు. శుభశ్రీ తన వాహనంపై వెళుతుండగా, ఒక్కసారిగా ఆ బ్యానర్ కిందపడటం చూసి భయటం బైకు‌ను పక్కకు నడిపే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడిపోయింది. 
 
ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ లారీ ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. వాటర్ ట్యాంకర్ లారీతో పాటు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బ్యానర్లు ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే నేతతో పాటు.. వాటిని కట్టిన కార్యకర్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
రహదారులకు ఇరువైపులా లేదా మధ్యలో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని మద్రాసు హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీచేసినప్పటికీ.. అధికార పార్టీ నేతలు మాత్రం యధేచ్చగా ఈ ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల ఈ తరహా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఓ యువతి ప్రాణాలు కోల్పోయిందనీ, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.