శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (20:26 IST)

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాల అభివృద్ది: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్రంలో పదిహేను కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాలను అభివృద్ది పర్చేందుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో కనీసం మూడు ప్రాంతాల్లోనైనా క్రీడా కేంద్రాల అభివృద్దికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. 

మంగళవారం అమరావతి సచివాలయం లోని తన చాంబరులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, ప్రాజక్టుల అమలు తీరును సమీక్షించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు.ఖేల్ ఇండియా పథకం క్రింద  విశాఖపట్నం, కడప, తూర్పు గోదావరి తదితర జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం, అభివృద్దికై ప్రతిపాదించామన్నారు.

రాష్ట్రంలోఉన్న ప్రతిభగల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో రూ.4.50 కోట్ల విలువైన వైఎస్సార్ క్రీడా పురస్కారాలను అందించడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా వైఎస్సార్ క్రీడా పురస్కారాలను అందజేసేందుకై ప్రభుత్వ ఆమోదానికై ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు.  క్రీడాకారులను ప్రోత్సహించేందుకై ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు క్రీడాకారులకు కేటాయించడం జరిగిందన్నారు.

స్పోర్ట్సు కోటా క్రింద జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలపాలని జిల్లా కలెక్టర్లకు డి.ఓ. లెటర్లు వ్రాసామని, ఆయా వివరాలు అందిన వెంటనే స్పోర్ట్సు కోటా క్రింద ఖాళీగానున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి  సహజసిద్దమైన వనరులు అపారంగా ఉన్నాయన్నారు. సహజసిద్దమైన ప్రకృతి వనరులు, అందాలు ఉన్న ఆయా ప్రాంతాలను అభివృద్ది పర్చి పొరుగు రాష్ట్రాల నుండి  పెద్ద ఎత్తున  పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు    ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్టా, గుంటూరు, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగు పర్యాటక సర్క్యూట్లను అభివృద్ది పరుస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రాయలసీమ పర్యాటక సర్క్యూట్ పరిధిలో  తలకోన, హార్సీ హిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలు, కృష్ణా,గుంటూరు పర్యాటక సర్క్యూట్ పరిధిలో  భవానీ ఐలెండ్సు, దుర్గమ్మ దేవాలయం, బౌద్ద ఆరామాలను, గోదావరి పర్యాటక సర్క్యూట్ పరిధిలో అన్నవరం, దిండి తదితర ప్రాంతాలతో పాటు  బోటింగ్ సౌకర్యాన్ని అభివృద్దిపరుస్తున్నామన్నారు.

అదే విధంగా ఉత్తరాంధ్రా ప్రాంతంలో పాడేరు, అరుకు, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం తదితర ప్రాంతాలను  పర్యాటక సర్క్యూట్ పరిధిలో అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యాటక సర్క్యూట్లపై  పర్యాటకుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని 13 పర్యాటక ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో యువజన శాఖ కార్యక్రమాల నిర్వహణ కూడా కొంతవరకు మందగించాయని, థర్డు వేవ్ లేని పక్షంలో ఆగస్టు మాసం నుండి ప్రతి నెలా కనీసం రెండు యువజన కార్యక్రమాలు నిర్వహిస్తామ‌న్నారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖలకు చెందిన సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.