అమరావతి బోటింగ్ అద్భుతం!
భవానీ ఐలాండ్ ఎడ్వంచర్ టూరిజం అధ్బుతంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ అమరావతి బోటింగ్ క్లబ్‌ని అభినందించారు. విజయవాడలోని కృష్ణా నదిలో ఇంతటి అద్భుతమైన వాటర్ స్పోర్ట్స్‌ని ఏర్పాటు చేయడం పెద్ద సాహసమే అని, దీనికి అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ) ఛైర్మన్, సి.ఐ.ఓ. తరుణ్ కాకాని, పవిత్ర కొండ్రెడ్డిలను ముందుగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
బెజవాడలో కృష్ణా బ్యారేజి సమీపంలో... కనకదుర్గమ్మ వేంచేసిన ఇంద్రకీలాద్రి సాక్షిగా పారుతున్న కృష్ణమ్మ ఒడిలో భవానీ ఐలాండ్ లో అమరావతి బోటింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన అడ్వంచర్ బోటింగ్ రైడ్ అనంతరం జాయింట్ కలెక్టర్ శివశంకర్ థ్రిల్లింగ్ అనుభూతిని పొందారు.
తనకు ఈ రైడ్ ఎంతో అనుభూతిని ఇచ్చిందని, ఎక్కడో విదేశాల్లో ఇలాంటి అడ్వంచర్ బోటింగ్ ఉంటుందని, సినిమాల్లో చూస్తుంటామని అన్నారు. కానీ, ఇపుడు ఇది విజయవాడలో సాక్షాత్కారం కావడం నిజంగా అద్భుతమే అని శివశంకర్ వివరించారు. అమరావతి బోటింగ్ క్లబ్ కృష్ణా నదిలో మొత్తం 20 బోట్లను విహారానికి ఏర్పాటు చేసింది.
భవానీ ఐలాండ్ లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ బోటింగ్ ఉంటుంది. ఇందులో అత్యాధునికమైన బోట్లు రైడింగ్ కి ఉంచారు. అందులో ఫ్రెంచ్ ఫన్ యాక్ స్పీడ్ బోట్లు రెండు ఉన్నాయి. అలాగే దుబాయ్ నుంచి తెప్పించిన టాంగో టర్కీ బోట్ ప్రత్యేక ఆకర్షణ. జేమ్స్ బాండ్ తరహాలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ, నీటిలో దూసుకుపోయే జెట్ అటాక్ బోట్లు దక్షిణ భారత దేశంలోనే ఒక్క అమరావతి బోటింగ్ క్లబ్ లోనే ఉన్నాయి.
ఇంకా మెక్సికో సీడో జెట్ స్కైస్ బోట్లు మూడు, అత్యంత ఉద్వేగాన్ని కలిగించే యారో స్పీడ్ బోట్లుతోపాటు అమెరికా బే లైనర్ లవ్ సీటింగ్ బోట్లు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. రివర్ కింగ్ వంటి 12 సీట్ల పైబడిన బోట్లు నడుపుతున్న సంస్థ కేవలం అమరావతి బోటింగ్ క్లబ్ మాత్రమేనని ఏబీసీ సీఇఓ తరుణ్ కాకాని పేర్కొన్నారు.