శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 2 జులై 2021 (16:38 IST)

హిందూ సంప్రదాయాలను హేళన చేస్తారా? శ్రీనివాసానంద స్వామి ఆవేదన

హిందూ సంప్రదాయాలను హేళన చేసే దోరణి మారాలని  శ్రీనివాసానంద స్వామి అన్నారు. విశాఖ‌ప‌ట్నం ప్రెస్ క్ల‌బ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే, ప్ర‌భుత్వం నుంచి స్పందన ఏదని శ్రీనివాసానంద స్వామి ప్రశ్నించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసయ్య స్త్రోత్రాలు గతంలో తాము చూశామని, అపుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఇప్పుడు మళ్లీ అదే విధంగా త‌మ మనోభావాలను దెబ్బతీయాలని చూశారని శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. సింహాచ‌లం దేవ‌స్థానం పాలకమండలి స్పందించడం లేదన్నారు. ఈఓ సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని  శ్రీనివాసానంద స్వామి డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నా దేవాదాయశాఖ మంత్రి మాట్లాడరెందుకని స్వామి ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన పై 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామన్నారని, కానీ ఏమైందని  శ్రీనివాసానంద స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. దేవాలయాలకు పట్టిన దుస్ధితిపై ఎంపీ  విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరని శ్రీనివాసానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.